ముంబై : ఇటీవలే మినిమమ్ బ్యాలెన్స్(కనీస నిల్వ) పెనాల్టీలపై కొంత ఊరట ఇచ్చిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో ఉపశమనం కల్పించింది. ఏడాదికి పైగా అమల్లో ఉన్న అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలను సేవింగ్స్ బ్యాంకు కస్టమర్లందరికీ రద్దు చేస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం కల్పించిన అనంతరం బ్యాంకు ఈ మేర ఊరట కల్పించడం ఇది రెండోసారి. ఇప్పటి వరకు అకౌంట్లను క్లోజ్ చేయడానికి బ్యాంకు రూ.500ను ప్లస్ సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. 14 రోజుల ఫ్రీ-లాక్ పిరియడ్‌లో మూసేవారికి మినహాయించి మిగతా వారందరికీ ఈ ఛార్జీలను విధిస్తోంది. అయితే వీటిని ప్రస్తుతం రద్దు చేస్తున్నట్టు, ఈ నెల నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించలేని పెనాల్టీ కస్టమర్లు తమ అకౌంట్లను మూసివేస్తున్న క్రమంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు సీనియర్ అధికారులు చెప్పారు.
అంతేకాక మినిమ్ బ్యాలెన్స్ పెనాల్టీలు పడుతున్న సాధారణ బ్యాంకు అకౌంట్ కస్టమర్లు బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్(బీఎస్‌బీఏ)కు మారుతున్నారు. బీఎస్‌బీఏ సాధారణ అకౌంట్ మాదిరే అయినప్పటికీ, చెక్‌బుక్ సౌకర్యముండదు. బీఎస్‌బీఏ అకౌంట్లకు ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకు అందిస్తోంది. అంతేకాక వాటిని ఆన్‌లైన్ లావాదేవీలకు వాడుకోవచ్చు. తప్పనిసరిగా నిర్వహించవలసిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో, దిగొచ్చిన బ్యాంకు ఇటీవలే ఈ పరిమితిని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గించింది. విద్యార్థులు, పెన్షనర్లు కూడా సాధారణ పొదుపు ఖాతాల కిందకు రావడంతో, వారిపై కూడా బ్యాంకు ఛార్జీలు వేసింది. ఇటీవల తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, సీనియర్ సిటిజన్లను మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయించబడ్డారు. ఎస్‌బీఐలో 42 కోట్ల మంది సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటే, వాటిలో 13 కోట్ల అకౌంట్లు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన లేదా బీఎస్‌బీఏ అకౌంట్లకు చెందినవి కాగా, మిగతా 29 కోట్లు సేవింగ్స్ అకౌంట్లు. వీటిలో 6 శాతం అకౌంట్లు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పాటించలేదు. ప్రస్తుతం ఈ కస్టమర్లు బీఎస్‌బీఏ అకౌంట్లలోకి మారడమో, మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించడమో చేయాల్సి ఉంది.