ఎస్‌బీఐ లాభం హైజంప్‌  | SBI Net profit surges 84percent to Rs 16,891 crore in Q3 results | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం హైజంప్‌ 

Published Fri, Feb 7 2025 12:39 AM | Last Updated on Fri, Feb 7 2025 12:39 AM

SBI Net profit surges 84percent to Rs 16,891 crore in Q3 results

క్యూ3లో రూ. 16,891 కోట్లు 

వడ్డీ ఆదాయం రూ. 41,446 కోట్లు 

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25,క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. స్టాండెలోన్‌ నికర లాభం 84% దూసుకెళ్లి రూ. 16,891 కోట్లను తాకింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో  రూ. 9,164 కోట్లు ఆర్జించింది. పెన్షన్‌ చెల్లింపులకు రూ. 7,100 కోట్ల మేర ప్రొవిజన్‌ చేపట్టడం ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లో ఎస్‌బీఐ రూ. 18,331 కోట్ల లాభం ఆర్జించింది. 

కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,18,193 కోట్ల నుంచి రూ. 1,28,467 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 4% పుంజుకుని రూ. 41,446 కోట్లకు చేరింది. రుణాల్లో 14% వృద్ధి నమోదైనప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.19% నీరసించి 3.15%కి పరిమితమయ్యాయి. కాసాకు బదులు కస్టమర్లు అధిక రాబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైనట్లు బ్యాంక్‌ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు.

ఎన్‌పీఏలు తగ్గాయ్‌: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 70 శాతం జంప్‌చేసి రూ. 18,853 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 11,064 కోట్ల లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,53,072 కోట్ల నుంచి రూ. 1,67,854 కోట్లకు ఎగసింది.  స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.42 శాతం నుంచి 2.07 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 0.64 శాతం నుంచి 0.53 శాతానికి తగ్గాయి. 

ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు 1.8% క్షీణించి రూ. 752 వద్ద క్లోజైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement