న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతంపైగా వృద్ధితో రూ. 18,540 కోట్లను తాకింది. ప్రధానంగా టెలికం, రిటైల్ విభాగాలకుతోడు చమురు, పెట్రోకెమ్ బిజినెస్ నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,265 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ2)లో ఆర్జించిన రూ. 16,563 కోట్లతో పోలి్చనా నికర లాభం బలపడింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం అధికంగా రూ. 2.67 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం పుంజుకుని రూ.48,003 కోట్లకు చేరుకుంది.
రిటైల్, ఆయిల్ గుడ్...
రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ. 3,458 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 90,333 కోట్లయ్యింది. కొత్తగా 779 స్టోర్లను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 19,102కు చేరింది. జామ్‌నగర్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్లాంట్లతోకూడిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 14,402 కోట్లను తాకింది. ఇంధన రిటైల్ విభాగం జియో–బీపీ రికార్డ్ అమ్మకాలు(పెట్రోల్, డీజిల్) సాధించినట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. కేజీ డీ6 బ్లాకు నుంచి తగ్గిన గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఇబిటా 4 శాతం నీరసించి రూ. 5,565 కోట్లకు పరిమితమైంది. సగటున గ్యాస్ ఉత్పత్తి రోజుకి 28.04
మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లుకాగా.. 21,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తిని సాధించింది.
యూఎస్ లగ్జరీ స్టోర్లు: ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా యూఎస్ లగ్జరీ రిటైలర్ ‘శాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ’ స్టోర్లకు దేశీయంగా తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. వెరసి అమెరికన్ లగ్జరీ డిపార్ట్‌మెంట్ స్టోర్లను దేశీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా మదర్‌కేర్ పీఎల్‌సీతో జేవీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. తద్వారా తల్లిదండ్రులు, పిల్లల ఉత్పత్తులందించే మదర్‌కేర్ బ్రాండును దేశీయంగా పరిచయం చేయనున్నట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ షేరు 2% లాభంతో రూ. 1,275 వద్ద ముగిసింది.
జియో దూకుడు
ఆర్‌ఐఎల్ టెలికం విభాగం రిలయన్స్ జియో ఈ ఏడాది క్యూ3లో రూ. 6,477 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో సాధించిన రూ. 5,208 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగసింది. ప్రధానంగా టారిఫ్‌ల పెంపు ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,368 కోట్ల నుంచి రూ. 29,307 కోట్లకు జంప్ చేసింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 47.88 కోట్ల నుంచి 48.21 కోట్లకు బలపడగా.. ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 195.1 నుంచి రూ. 203.3కు ఎగసింది. టెలికం, డిజిటల్ విభాగాల జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 6,861 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19% అధికమై రూ. 38,750 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment