public sector banking
-
ఎస్బీఐ లాభం 35% డౌన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో రూ. 9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.14,205 కోట్లతో పోలిస్తే లాభం 35 శాతం తగ్గింది. ప్రధానంగా వేతనాలు, పెన్షన్ల కోసం వన్‌టైమ్ ప్రొవిజనింగ్ బ్యాంక్ లాభదాయకతకు గండి కొట్టింది. ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న 17% వేతన సెటిల్మెంట్ కారణంగా వేతనాలు, పెన్షన్ల కోసం అదనపు వన్‌టైమ్ ప్రొవిజనింగ్‌ను చేయాల్సి వచి్చందని, ఇది గనుక లేకపోతే నికర లాభం రూ.16,264 కోట్లుగా ఉండేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత లాభదాయకత ప్రకారం, రూ.40,000 కోట్లను సులభంగా సమీకరించగమని ఖారా చెప్పారు. అవి లేకుండా కూడా అదనంగా రూ.7.5 లక్షల కోట్ల రుణాలిచ్చే లిక్విడిటీ బఫర్ ఉందని ఆయన వివరించారు. మొండి బకాయిలు దిగొచ్చాయ్... క్యూ3లో స్థూల మొండి బకాయిలు 72 బేసిస్ పాయింట్లు దిగొచ్చి 2.42 శాతానికి (రూ.86,749 కోట్లు) తగ్గాయి. /æక నికర మొండి బకాయిలు కూడా 13 బేసిస్ పాయింట్లు తగ్గి 0.64 శాతానికి (రూ.22,408 కోట్లు) చేరాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి అని ఖారా పేర్కొన్నారు. కాగా, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 1 శాతం తగ్గి 3.28 శాతానికి పరిమితమైంది. మొత్తం రుణాలు 14.38 శాతం ఎగబాకి రూ.35.84 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 13.02 శాతం పెరిగి రూ. 47.62 లక్షల కోట్లకు ఎగిశాయి. పేటీఎం కస్టమర్లకు స్వాగతం... మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను దాదాపు నిలిపేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో, పేటీఎం కస్టమర్లకు (ఎక్కువ మంది వ్యాపారులే) సాయపడేందుకు ఎస్బీఐ సిద్ధంగా ఉందని చైర్మన్ ఖారా చెప్పారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
మొండి బకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారం, రుణ వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థికశాఖ కీలక వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఇతర కీలక కార్యక్రమాల వల్ల ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. దీనితో సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ ఖరాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు, బ్యాంకుల ఎండీ, సీఈఓలు పాల్గొన్న ఈ సమావేశం వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల పనితీరు, పురోగతిపై చర్చించింది. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పథకాలపై సమావేశం చర్చించింది. బ్యాంకింగ్‌కు అవసరమైన మూలధన సమకూర్చడం, దేశంలో అందరికీ ఆర్థిక సేవలు వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు సవాళ్లను తట్టుకునే సామర్థ్యం ఇదిలాఉండగా, భారత్ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, సుస్థిర ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడం, దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికశాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉందని కూడా నివేదిక భరోసాను ఇచ్చింది. తోటి వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది. -
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
ఎస్బీఐలో వీఆర్ఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు సుమారు 30,190 మంది ఉద్యోగులకు అర్హత ఉంటుందని తెలుస్తోంది. వీఆర్ఎస్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్ – 2020’ పేరిట ప్రతిపాదించే స్కీమును ప్రధానంగా మానవ వనరుల వినియోగాన్ని, ఖర్చులను మెరుగుపర్చుకోవడానికి ఉద్దేశించినట్లు వివరించాయి. తమ కెరియర్లో ఆఖరు స్థాయికి చేరినవారు, అత్యుత్తమ పనితీరు కనపర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు కూడా ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. అయితే, ప్రతిపాదిత వీఆర్ఎస్ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరణులను సూచిస్తోందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా వ్యాఖ్యానించారు. పాతికేళ్ల సర్వీసు.. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. ముసాయిదా ప్రకారం వీఆర్ఎస్ పథకం డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి ఆఖరు దాకా అమల్లో ఉంటుంది. వీఆర్ఎస్ దరఖాస్తులను ఈ వ్యవధిలో మాత్రమే స్వీకరిస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్ఎస్ ఎంచుకునేందుకు అర్హత ఉంటుంది. 2020 జూలై వేతనాలు బట్టి అర్హత కలిగిన ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది దీన్ని ఎంచుకున్నా బ్యాంకుకు నికరంగా సుమారు రూ. 1,663 కోట్ల దాకా మిగులుతుందని అంచనా. వీఆర్ఎస్ ఎంచుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, వైద్యం తదితర ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే దీని కింద రిటైరైన వారు పదవీ విరమణ తేది నుంచి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. గతేడాది 2.57 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 మార్చి ఆఖరు నాటికి 2.49 లక్షలకు తగ్గింది. -
బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్) 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ఉంటుంది. ఇప్పటిదాకా ఇది 8.15 శాతంగా ఉంది. మరోవైపు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) విధానం ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను జనవరి 3 నుంచి సవరిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. వివిధ కాలావధులకు సంబంధించి వడ్డీ రేటు 0.05 శాతం మేర తగ్గనుంది. -
వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం... ►నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గింది. బ్యాంక్ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి. ►ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 8 శాతానికి దిగి వచ్చింది. ►ఇక టర్మ్ డిపాజిట్ రేట్లనూ బ్యాంక్ తగ్గించింది. రెండేళ్ల వరకూ రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు అన్ని కాల వ్యవధులపై 30 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. -
ఎస్బీఐ లాభం... ఆరు రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4.5% వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని, ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది. స్టాండ్అలోన్ లాభం రూ.3,012 కోట్లు స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212%)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఉంటుందన్నారు. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95% నుంచి 7.19%కి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి దిగొచ్చాయి. నికర లాభం మూడు రెట్లు పెరగడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 7.5 శాతం లాభంతో రూ.282 వద్ద ముగిసింది. -
పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా 3.50 శాతంగా ఉన్న రేటు ఇకపై 3.25%కి తగ్గనుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌పై రేటును (రూ. లక్ష దాకా బ్యాలెన్స్) సవరిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు, 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. రుణాలపై 0.10 శాతం తగ్గింపు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా 0.10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రుణాలపై రేటు తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ ఇకపై 8.15% కాకుండా 8.05%గా ఉండనుంది. ఈ తగ్గింపు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. ‘పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాల ఖాతాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం‘ అని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన ఎస్బీఐ.. రుణాలపై వడ్డీ రేటును మాత్రం 0.10 శాతమే తగ్గించడం గమనార్హం. వృద్ధికి ఊతమిచ్చే దిశగా తక్కువ వడ్డీ రేట్లకే ప్రజలకు రుణాలు అందాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను (రెపో రేటు) తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంకుల స్థాయిలో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందడం లేదు. ఆర్బీఐ ఈ ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును తగ్గించడంతో ఇది ప్రస్తుతం దశాబ్దపు కనిష్ట స్థాయి 5.15%కి చేరింది. కానీ బ్యాంకుల స్థాయిలో మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేటు తగ్గడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పేమెంటు బ్యాంకులకు పోటీగా సీఎస్పీలు
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కోల్‌కతా : పేమెంట్ బ్యాంకులతో పోటీపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో.. తక్కువ వ్యయాలతో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు తాము ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే మరింత మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోగలగడం పేమెంట్ బ్యాంకులకు అనుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. గ్రామగ్రామాన పేమెంట్ బ్యాంకుల అసోసియేట్లు ఉండటం వల్ల వాటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయని ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు బ్యాం కింగ్ సేవలు లేని పంచాయతీల్లో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్పీ) ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ప్రింటర్, స్కానర్‌ను ఉపయోగించగలిగేలా కనీస విద్యార్హతలున్న యువతకు శిక్షణనివ్వనున్నట్లు అరుంధతి భట్టాచార్య చెప్పారు. తాము ఇటీవల ప్రవేశపెట్టిన మొబైల్ వాలెట్ ‘బడీ’ కూడా పేమెంట్ బ్యాంకుల పరిధిలోనే పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణాలు ఇవ్వలేకపోవడం పేమెంట్ బ్యాంకులకు ప్రతికూలాంశమని అరుంధతి భట్టాచార్య వివరించారు. బ్యాంక్ యూనియన్ల వ్యతిరేకత.. వడోదర: పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ (ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఉంటుందని పేర్కొంది. పేమెంట్ బ్యాంకుల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంకుల ప్రాధాన్యం పెరుగుతుంది, ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా తగ్గే అవకాశం ఉందని వివరించింది. దాదాపు 41 సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే వాటిలో 11 సంస్థలకు ఆర్బీఐ ఇటీవల అనుమతినిచ్చింది.