న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు సుమారు 30,190 మంది ఉద్యోగులకు అర్హత ఉంటుందని తెలుస్తోంది. వీఆర్‌ఎస్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్‌ఎస్ – 2020’ పేరిట ప్రతిపాదించే స్కీమును ప్రధానంగా మానవ వనరుల వినియోగాన్ని, ఖర్చులను మెరుగుపర్చుకోవడానికి ఉద్దేశించినట్లు వివరించాయి.
తమ కెరియర్‌లో ఆఖరు స్థాయికి చేరినవారు, అత్యుత్తమ పనితీరు కనపర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు కూడా ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. అయితే, ప్రతిపాదిత వీఆర్‌ఎస్ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరణులను సూచిస్తోందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా వ్యాఖ్యానించారు.
పాతికేళ్ల సర్వీసు..
కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. ముసాయిదా ప్రకారం వీఆర్‌ఎస్ పథకం డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి ఆఖరు దాకా అమల్లో ఉంటుంది. వీఆర్‌ఎస్ దరఖాస్తులను ఈ వ్యవధిలో మాత్రమే స్వీకరిస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్‌ఎస్ ఎంచుకునేందుకు అర్హత ఉంటుంది. 2020 జూలై వేతనాలు బట్టి అర్హత కలిగిన ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది దీన్ని ఎంచుకున్నా బ్యాంకుకు నికరంగా సుమారు రూ. 1,663 కోట్ల దాకా మిగులుతుందని అంచనా. వీఆర్‌ఎస్ ఎంచుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, వైద్యం తదితర ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే దీని కింద రిటైరైన వారు పదవీ విరమణ తేది నుంచి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. గతేడాది 2.57 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 మార్చి ఆఖరు నాటికి 2.49 లక్షలకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment