ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో రూ. 9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.14,205 కోట్లతో పోలిస్తే లాభం 35 శాతం తగ్గింది. ప్రధానంగా వేతనాలు, పెన్షన్ల కోసం వన్‌టైమ్ ప్రొవిజనింగ్ బ్యాంక్ లాభదాయకతకు గండి కొట్టింది.
ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న 17% వేతన సెటిల్‌మెంట్ కారణంగా వేతనాలు, పెన్షన్ల కోసం అదనపు వన్‌టైమ్ ప్రొవిజనింగ్‌ను చేయాల్సి వచి్చందని, ఇది గనుక లేకపోతే నికర లాభం రూ.16,264 కోట్లుగా ఉండేదని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత లాభదాయకత ప్రకారం, రూ.40,000 కోట్లను సులభంగా సమీకరించగమని ఖారా చెప్పారు. అవి లేకుండా కూడా అదనంగా రూ.7.5 లక్షల కోట్ల రుణాలిచ్చే లిక్విడిటీ బఫర్ ఉందని ఆయన వివరించారు.
మొండి బకాయిలు దిగొచ్చాయ్...
క్యూ3లో స్థూల మొండి బకాయిలు 72 బేసిస్ పాయింట్లు దిగొచ్చి 2.42 శాతానికి (రూ.86,749 కోట్లు) తగ్గాయి. /æక నికర మొండి బకాయిలు కూడా 13 బేసిస్ పాయింట్లు తగ్గి 0.64 శాతానికి (రూ.22,408 కోట్లు) చేరాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి అని ఖారా పేర్కొన్నారు. కాగా, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 1 శాతం తగ్గి 3.28 శాతానికి పరిమితమైంది. మొత్తం రుణాలు 14.38 శాతం ఎగబాకి రూ.35.84 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 13.02 శాతం పెరిగి రూ. 47.62 లక్షల కోట్లకు ఎగిశాయి.
పేటీఎం కస్టమర్లకు స్వాగతం...
మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను దాదాపు నిలిపేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశించిన నేపథ్యంలో, పేటీఎం కస్టమర్లకు (ఎక్కువ మంది వ్యాపారులే) సాయపడేందుకు ఎస్‌బీఐ సిద్ధంగా ఉందని చైర్మన్ ఖారా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment