ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు.
రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్‌లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment