ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ లాభాల బాట | Profit of public sector banks rises 9percent to Rs 15306 cr in June quarter | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ లాభాల బాట

Published Thu, Aug 11 2022 1:34 AM | Last Updated on Thu, Aug 11 2022 1:34 AM

Profit of public sector banks rises 9percent to Rs 15306 cr in June quarter - Sakshi

న్యూఢిల్లీ:  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్‌ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్‌ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, పీఎన్‌బీ,  బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్‌ ఈల్డ్, మార్క్‌–టు–మార్కెట్‌ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్‌ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి.
► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి.  
► పుణేకు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్‌ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి.  
► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్‌బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది.  మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్‌బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిలిచింది.


2021–22లో ఇలా...
2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు  గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్‌బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్‌లను ప్రకటించాయి.  

2020–21 యూటర్న్‌!
నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్‌ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్‌ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు,  2019–20లో రూ.25,941 కోట్లు,  2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్‌ నష్టాల బాట నడిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement