హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది.
సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment