Aurobindo Pharma
-
అరబిందో లాభం అదిరింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్ 65 బేసిస్ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.మొత్తం ఫార్ములేషన్స్ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్ ఫార్ములేషన్స్ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.సింహభాగం యూఎస్..మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్‌లో యూఎస్ 45.3% తో సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్వీ ఫార్ములేషన్స్ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్‌ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. -
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సిద్ధం అయింది. జూన్‌లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్‌ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్‌వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
బయోఫ్యాక్చురాతో అరబిందో కంపెనీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్‌కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు. ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి. -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్‌కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్‌లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్‌ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం
సాక్షి, విశాఖపట్నం: క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విశాఖ జిల్లా బాధితులకు సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.16.80 లక్షలను విరాళంగా అందజేసింది. ఆరు నెలలపాటు 400 మంది రోగులకు ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి సంస్థ ఎండీ కె.నిత్యానందరెడ్డి తరఫున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు సోమవారం అందజేశారు. ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం అందించేందుకు రూ.4,200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో విశాఖపట్నం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
ఎల్లో ఎజెండాకు లిక్కర్ కిక్కు
మీడియా మారింది. జనానికి నిమిషాల్లో నిజాలు తెలుస్తున్నాయి. అయినా సరే... చంద్రబాబు ముఠాది పాత స్కీమే. తమ వ్యతిరేకులకు సంబంధించి నోటికొచ్చిన ఆరోపణలు చేయటం... అవన్నీ నిజాలైనట్లుగా పతాక శీర్షికల్లో ప్రచురించటం... వాటిని ప్రచారంలో పెట్టడం!!. అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలో అరెస్టయిన నాటి నుంచీ ఈ ఎల్లో ముఠాలకు పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. ఆ సంఘటనకు లేని లింకులు పెడుతూ... ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చిన ఆరోపణలకు దిగుతున్నారు. ఎద్దు ఈనిందంటే... దూడను కట్టేయమన్న చందంగా... అన్ని వేలకోట్లు, ఇన్ని వేల కోట్లు అంటూ చెలరేగిపోతున్నారు. ఈ ఎల్లో అరాచకాలపై విజయసాయిరెడ్డి వాస్తవాలను వెల్లడించారు. దుష్టచతుష్టయం ఎందుకిలా చెలరేగిపోతున్నదో... విశాఖ విషయంలోనూ ఎందుకు రోజూ విషం గక్కుతోందో నిజానిజాలు ఆయన మాటల్లోనే... అరబిందో ఫార్మాది 36 ఏళ్ల చరిత్ర. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలోని ఫార్మా కంపెనీల్లో టాప్–2 స్థాయికి చేరుకుంది. ఏడాదికి 2,600 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థలు ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసినా... ఇతర పెట్టుబడిదారులు ముందుకొస్తారు. అందుకే అవుకు, శింగనమల ప్రాంతాల్లో 800 మెగావాట్ల చొప్పున రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో అరబిందోకు ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా... 2000 కోట్లతో తొలిసారి భారతదేశంలో ‘పెన్సిలిన్–జి’ను ఉత్పత్తి చేసే ప్లాంటును కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేస్తోంది. 2024లో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కావచ్చునని సంస్థ ప్రకటించింది. ఇతర రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థకు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులిస్తే తప్పేంటి? దీనివల్ల రాష్ట్రానికి లాభమే కదా? ప్రాజెక్టు కోసం ప్రభుత్వ స్థలమిస్తే దానికి లీజు చెల్లిస్తారు. ప్రయివేటు స్థలాలైతే కొనుక్కుంటున్నారు. పైపెచ్చు ప్రతి మెగావాట్‌కు ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ప్రతి ఫలాన్ని ప్రభుత్వానికి కంపెనీయే చెల్లిస్తుంది. విద్యుత్‌కు అత్యధిక డిమాండ్ – అతి తక్కువ డిమాండ్ ఉన్నపుడు ఈ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల గ్రిడ్ స్థిరంగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా రాష్ట్రానికి మంచిదే కదా? ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం? అరబిందో అనేది ప్రధానంగా వ్యాపార సంస్థ. దాదాపు ప్రపంచమంతటా దీని ఫార్మా వ్యాపారం విస్తరించి ఉంది. ఇతర వ్యాపారాల్లోనూ ఉంది. ఢిల్లీలో మద్యం సరఫరాకు టెండర్లు పిలిస్తే ఈ సంస్థ కూడా పాల్గొంది. అది తప్పేమీ కాదు కదా? టెండర్లు ఖరారయ్యాక కొన్ని నిబంధనల్లో సడలింపు ఇచ్చారనే ఆరోపణలు ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వానికి– కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. కొంత మేర తెలంగాణ ప్రభుత్వంపైనా ఆరోపణలొచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం? కనీసం ఏపీ పేరును సీబీఐ గానీ, ఈడీ గానీ ఎక్కడా మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు కదా? మరి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం? విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడిని కంపెనీ ప్రతినిధిగా అరెస్టు చేసి ఉండొచ్చు. దాంతో విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? ఏ కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారైనా ఇవన్నీ ఆలోచిస్తారు కదా? అలాకాకుండా ప్రతిరోజూ తెలుగుదేశం నేతలు పనిగట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, విజయసాయిరెడ్డిని దీన్లోకి లాగుతూ... వేల కోట్లంటూ పసలేని ఆరోపణలు చేయటం సమంజసమా? దాన్నొ ఉద్యమం మాదిరి ప్రచురిస్తున్న రామోజీరావు ఇంకెంత కిందికి దిగజారిపోతారు? ఒక పత్రికగా మీ బాధ్యత మీకు ఉండక్కర్లేదా? చంద్రబాబుతో సంబంధం ఉన్నట్టేగా? ఇదే అరబిందో గ్రూపును అభ్యర్థించి వారి భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా 2000వ సంవత్సరంలో తన కుటుంబీకుల చేత ఆంధ్రా ఆర్గానిక్స్ పెట్టించారు. మరి అరబిందో ఫార్మాతో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టేగా? ఇవెక్కడి తలతిక్క ఆరోపణలు? బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టిన చందాన ఏ వ్యవహారంలోనైనా పదేపదే అదాన్ డిస్టిలరీస్ పేరు తెరపైకి తెస్తోంది ఈ పచ్చ ముఠా. అసలు ఈ అదాన్ డిస్టిలరీస్ ఎవరిది? దీన్ని ఏర్పాటు చేసింది అయ్యన్న పాత్రుడు కాదా? అసలు రాష్ట్రంలో మద్యం సరఫరా చేయటానికి అనుమతి ఇస్తూ 20 డిస్టిలరీలను ప్యానెల్లో చేరిస్తే... అందులో ఒక్కటంటే ఒక్కటైనా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటయినది ఉందా? అందులో ఒక్క కంపెనీనైనా ఈ ప్రభుత్వం ప్యానెల్లో చేర్చిందా? అవన్నీ అప్పటికే ఏర్పాటయినవి కదా? చంద్రబాబు ప్రభుత్వమే ప్యానెల్లో చేర్చింది కదా? పెపెచ్చు ఆ 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటయ్యాయి. అంటే వాటన్నిటి వెనకా చంద్రబాబు నాయుడి హస్తం ఉన్నట్టే కదా? తాను అధికారంలోంచి దిగిపోతూ కూడా ఈ డిస్టిలరీలపై ప్రేమ చావక బోలెడన్ని బ్రాండ్లకు అనుమతిస్తూ దిగిపోయాడు. ఇప్పుడేమో ఆ బ్రాండ్లను ఈ ప్రభుత్వానికి అంటగడుతూ తెలుగుదేశం నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం? మీడియా మీ చేతుల్లో ఉన్నంత మాత్రాన అబద్ధాలు నిజమైపోతాయా రామోజీరావు? ముడుపులన్నీ చంద్రబాబుకేగా? డిస్టిలరీలకు లైసెన్సులిచ్చి, వాటిని ఏర్పాటు చేశాక... వాటి నుంచి ప్రభుత్వం మద్యం కొనేందుకు వీలుగా వాటిని ప్యానెల్లో పెట్టిన చంద్రబాబుకు ముడుపులిస్తారా? లేకపోతే వాటినే కొనసాగిస్తున్న వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి ముడుపులిస్తారా? ఇది తెలిసి కూడా తెలుగుదేశం నేతలు రోజూ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అదాన్ డిస్టిలరీస్ అనేది అయ్యన్న పాత్రుడికి సంబంధించిన సంస్థ అనే విషయాన్ని రాయరెందుకు రామోజీ? ఆ విషయాన్ని తెలుగుదేశం కూడా ఎప్పుడూ ప్రస్తావించదెందుకు? ► ఇక ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ సంస్థ ఈ మూడున్నరేళ్లలో 70,000 కోట్ల విలువైన మద్యాన్ని వివిధ డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసింది. అందులో అదాన్ వాటా 1,100 కోట్లు. అంటే దాదాపు 1.55 శాతం. నిండా 2 కూడా లేదు. వీళ్లద్వారా ఇంత తక్కువ మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్న విషయాన్ని ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరెందుకు? మొత్తం మద్యాన్ని ఈ కంపెనీ నుంచే కొన్నట్టు పదేపదే ఈ పేరు తీస్తూ చెలరేగిపోతున్నారెందుకు? అబద్ధాలతో ఎన్నాళ్లని నమ్మించగలరు? మీకు అర్థసత్యాలు, అసత్యాలు తప్ప వాస్తవాలు అక్కర్లేదా? ఎన్నాళ్లిలా జనాన్ని మోసం చేస్తారు? ‘ఈనాడు’ అంటేనే వక్రీకరణ. ఎల్లో మీడియా అంటేనే అబద్ధాల పుట్ట. ఎన్ని సార్లు రాసినా... టీడీపీ ఆరోపణల్ని ఎంత మోసినా ఇవే కదా? ఇంత వయసు మీదపడ్డా... మీరు మారరా రామోజీ? ► నిజం చెప్పాలంటే ఈ దుష్టచతుష్టయం ఒక డీపీటీ బ్యాచ్. అంటే దోచుకో–పంచుకో– తినుకో అనే సూత్రాన్ని అక్షరాలా తమ హయాంలో అమలు చేసి చూపించిన గజదొంగల ముఠా. గతంలో ఎవరి వాటా వారికి అందింది. కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్. ఒక్క వార్తా రాయలేదు. ఇప్పుడు ప్రశ్నించడానికి బయలుదేరిన దత్తపుత్రుడు నాడు ఒక్క ప్రశ్నా వేయలేదు. ఇప్పుడు అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వాళ్ల వాటాలు ఆగిపోయాయి. అందుకే ఈ గజదొంగల ముఠా కడుపు మండుతోంది. అందుకే గంటకో ఆరోపణ. పూటకో వేషం. రోజుకో నాటకం!. వీటన్నిటి గురించీ ఫిలిం సిటీ కొండమీద కట్టుకున్న కోటలో రామోజీరావు– చంద్రబాబు మంతనాలు. అవేమైనా రాజకోట రహస్యాలా? రాజకీయ వ్యభిచారపుటెత్తులే కదా? విశాఖలో కబ్జాలకు కేరాఫ్ రామోజీ, టీడీపీ అంతా మీకు నచ్చినట్లే... మీరు అనుకున్నట్లే జరగాలంటే ఎలా రామోజీరావు? మీరు మహా భూ కుంభకోణానికి స్కెచ్ వేసిన అమరావతి నాటకం కొనసాగనివ్వలేదని... విశాఖపై విషం కక్కుతారా? అసలు విశాఖలో కబ్జాలకు శ్రీకారం చుట్టిందెవరు? విశాఖ నగరానికి అక్షర ఫ్యాక్షనిజాన్ని నేర్పించింది రామోజీరావు కాదా? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో స్థల యజమానుల్ని న్యాయ స్థానాలకు ఈడ్చింది రామోజీరావు కాదా? తనది కాకపోయినా లీజు స్థలాన్ని ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా వచ్చిన స్థలాన్ని తన కొడుకు కిరణ్ పేరిట కాజేసిన చరిత్ర ఆయనది కాదా? దీనికోసం ఏకంగా దొంగ సంతకాలు పెట్టి, ఇతరుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసేసిన వ్యక్తి నీతులు చెప్పటం ఎంతవరకు సమంజసం? గీతం కాలేజీ పెట్టి ఏకంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం నాయకుడు కాదా? దసపల్లా హిల్స్‌లో ఇరు పక్షాల మధ్య వివాదం ఉండగా... ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ముఖ్యమంత్రి హోదాలో కబ్జా చేసిందెవరు? అయ్యన్న పాత్రుడిదీ ఫోర్జరీ చరిత్రేగా? భూముల పరిహారం విషయంలో నకిలీ పట్టాలు సృష్టించి మరీ కాజేసిన ‘బండారు’ సత్యం బయటపడలేదా? ఇవన్నీ మీ ‘ఈనాడు’లో ఏనాడూ రాయరెందుకు రామోజీ? ఎందుకంటే వాళ్లు మీ భాగస్వాములనా? మరిప్పుడు ప్రతిరోజూ విశాఖపై విద్వేషం చిమ్మటమెందుకు? అక్కడకు రాజధాని రాకూడదనా? విశాఖ నగరానికున్న వెయ్యేళ్ల ఘన చరిత్రను... భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆ నగరానికున్న ప్రాధాన్యాన్ని సాక్షాత్తూ ఈ దేశ ప్రధానే చెప్పారు. అయినా మీ బుద్ధి మారదెందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఒకే ఒక్క అగ్రశ్రేణి నగరంపై మీకెందుకింత కక్ష? బౌన్సర్లను పెట్టుకుని మరీ విశాఖకు వ్యతిరేకంగా సాగించిన యాత్ర నకిలీదని న్యాయ స్థానాల సాక్షిగా తేలిపోయింది కదా!! అయినా సరే బుద్ధి లేకుండా ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ నాయకులపై ఆరోపణలెందుకు? రోజూ పనిగట్టుకుని చెబితే అబద్ధాలు నిజాలైపోతాయా? మీరే తప్పుడు వార్తలు రాసి... మీరే నానా యాగీ చేస్తే ఎలా? పేదలకు ఇంగ్లిష్ మీడియం వద్దంటూ కోర్టులకెక్కి యాగీ చేసేదీ మీరే!!. పేదలకు ఇళ్లు రాకుండా న్యాయ స్థానాలకెళ్లి అడ్డుపడ్డదీ మీరే. ప్రతి స్థలాన్నీ వివాదాస్పదం చేసిందీ మీరే. కానీ ఒక్కటి మాత్రం నిజం!. మీ ముఠా వ్యూహాలను చిత్తు చేసే సంకల్ప బలం ఈ ప్రభుత్వానికి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది. దానికి ప్రజాశీస్సులూ మెండుగా ఉన్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 576 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి. పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్ చేస్తోంది. -
అరబిందో చేతికి వెరిటాజ్ దేశీ ఫార్ములేషన్స్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తాజాగా వెరిటాజ్ హెల్త్‌కేర్‌కి చెందిన దేశీ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ. 171 కోట్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. దేశీ మార్కెట్లో విస్తరించడానికి ఈ డీల్ తోడ్పడగలదని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో అరబిందోకి ఉన్న సామర్థ్యాలు, విస్తృతమైన వెరిటాజ్ నెట్వర్క్ తోడ్పాటుతో రాబోయే రోజుల్లో దేశీ ఫార్మా మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా బయోసిమిలర్లు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్రిటికల్ కేర్ చికిత్స విభాగంలో వెరిటాజ్కు 40 పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఫెపానిల్, మెరోగ్రామ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. 50,000 మంది పైచిలుకు రిటైలర్లు సంస్థ నెట్‌వర్క్‌లో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 127 కోట్ల టర్నోవరు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ. 133 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సోమవారం అరబిందో షేరు బీఎస్ఈలో సుమారు ఒకటిన్నర శాతం క్షీణించి దాదాపు రూ. 707 వద్ద క్లోజయ్యింది. -
సిబ్బందికి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దుకోవడంపై ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా దృష్టి సారించింది. ఇందులో భాగంగా లీడర్షిప్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మార్కెట్లో ట్రెండ్లపై పట్టు సాధించేలా ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గీతం యూనివర్సిటీతో జట్టుకట్టింది. ’ఫోర్ పిల్లర్స్ ఫర్ ఫ్యూచర్ రెడీ మేనేజర్స్’ పేరిట మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 27 మంది ఉద్యోగులకు శిక్షణ కల్పిస్తోంది. వైజాగ్ క్లస్టర్‌లోని మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది దీని కోసం ఎంపికయ్యారని అరబిందో ఫార్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) యూఎన్‌బీ రాజు తెలిపారు. నెలకు రెండు శనివారాలు చొప్పున నాలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో కొత్త హోదాలు, బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన సామర్థ్యాలను సంతరించుకోవడానికి ఉద్యోగులకు ఇది తోడ్పడగలదని రాజు పేర్కొన్నారు. -
ఆకట్టుకోని అరబిందో ఫార్మా
న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) పనితీరు పరంగా ఆకట్టుకోలేకపోయింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణించి రూ.604 కోట్లకు పరిమితమైంది. రవాణా, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం కంపెనీ లాభాలపై ప్రభావం చూపించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.777 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఒక శాతం పెరిగి రూ.6,002 కోట్లుగా నమోదైంది. ‘‘అధిక ముడి సరుకుల ధరలు, రవాణా వ్యయాలు డిసెంబర్ త్రైమాసికంలో లాభాలపై ప్రభావం చూపించాయి. కానీ స్థిరమైన ఆదాయంతో మా వ్యాపారం బలంగా పటిష్టంగానే ఉంది. కీలక ఉత్పత్తులకు ఏపీఐ డిమాండ్ బలంగా ఉండడం అనుకూలించింది’’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానందరెడ్డి తెలిపారు. తమ తయారీ యూనిట్లకు సంబంధించి నెలకొన్న నియంత్రణపరమైన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అలాగే, కాంప్లెక్స్ జనరిక్ ఉత్పత్తుల అభివృద్ధి ప్రణాళికల్లో స్థిరమైన పురోగతి ఉన్నట్టు తెలిపారు. రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుకు మూడో మధ్యంతర డివిడెండ్‌గా రూ.1.50 చొప్పున (150%) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. -
జిమ్నాస్ట్ అరుణా రెడ్డికి 5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
క్రోనస్ డీల్ రద్దు చేసుకున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రోనస్ ఫార్మా డీల్‌ను రద్దు చేసుకున్నట్టు అరబిందో ఫార్మా వెల్లడించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఈ మేరకు సమ్మతి తెలిపింది. డీల్ రద్దు విషయమై ఇరు సంస్థలు పరస్పరం అంగీకరించాయని వివరించింది. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఆగస్ట్ 12న అరబిందో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. -
అరబిందో లాభం రూ.770 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా ప్రకటించింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం ఎగసి రూ.770 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్రోల్‌ను మినహాయించారు. యూఎస్ ఫార్ములేషన్స్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థిరంగా ఉండి రూ.2,681 కోట్లు సాధించింది. యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19.7 శాతం వృద్ధితో రూ.1,583 కోట్లు నమోదు చేసింది. ఏపీఐల ఆదాయం రూ.780 కోట్ల నుంచి రూ.812 కోట్లకు చేరింది. ఆదాయంలో 6.3 శాతం.. పరిశోధన, అభివృద్ధికి రూ.358 కోట్లు వెచ్చించారు. ఆదాయంలో ఇది 6.3 శాతం. మూడు ఇంజెక్టేబుల్స్తో కలిపి నాలుగు ఏఎన్‌డీఏలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతి లభించింది. 2021–22 ఏడాదికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు సమ్మతించింది. సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో త్రైమాసిక పనితీరు సంస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో అరబిందో 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. అలాగే అనుబంధ కంపెనీలైన ఆరోనెక్సŠట్ ఫార్మా, ఎమ్వియెస్ ఫార్మా వెంచర్స్‌ను అరబిందో ఫార్మాలో విలీనం చేయనున్నట్టు ప్రకటించింది. అరబిందో షేరు ధర గురువారం 3.64 శాతం తగ్గి రూ.825.70 వద్ద స్థిరపడింది. -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్‌లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్‌కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్‌లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
అరబిందో లాభం డౌన్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది. నాట్రోల్ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది. బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్ ప్రైవేట్లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్–16తో కూడిన బిజినెస్‌ను స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థ వైటెల్స్ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. కీలక విభాగాలు భేష్ కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది. -
మూడు ప్లాంట్లు స్థాపించనున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా క్లిష్టమైన ఔషధాల తయారీని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత పథకం (పీఎల్ఐ) కింద అరబిందో ఫార్మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కర్ణాటక యాంటీబయాటిక్స్, ఫార్మాస్యూటికల్స్‌కు (కేఏపీఎల్), కిన్వన్ అనే ప్రైవేటు కంపెనీకి సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. పీఎల్ఐ కింద ఏర్పాటు చేయనున్న ప్లాంట్లకు ఈ మూడు సంస్థలు రూ.3,761 కోట్ల పెట్టుబడి చేయనున్నాయి. అలాగే 3,827 ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగు విభాగాల్లో.. ప్రతిపాదిత ప్లాంట్లలో 2023 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్యపర ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2030–31 మధ్య పెన్సిలిన్–జి, 7–ఏసీఏ, ఎరిథ్రోమైసిన్ థియోసైనేట్, క్లావులానిక్ యాసిడ్ విభాగాల్లో రూ.6,940 కోట్లు ఖర్చు చేయనుంది. తయారీ కేంద్రాల రాకతో ఈ కీలక ముడిపదార్థాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. అరబిందో ప్లాంట్లు ఇవే.. పెన్సిలిన్–జి, 7–అమైనోసెఫలోస్పోరానిక్ యాసిడ్ (7–ఏసీఏ) తయారీకై లైఫియస్ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా దరఖాస్తు చేసింది. రూ.1,392 కోట్లతో 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పెన్సిలిన్–జి ప్లాంటుతోపాటు రూ.813 కోట్లతో 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 7–ఏసీఏ యూనిట్ స్థాపించనున్నారు. అలాగే క్యూల్ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా ఎరిథ్రోమైసిన్ థియోసైనేట్ తయారీకై రూ.834 కోట్లతో 1,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. మూడు కేంద్రాలకు సంస్థ రూ.3,039 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
కోవాక్స్ వ్యాక్సిన్ తయారీకి అరబిందో ఓకే
బెంగళూరు, సాక్షి: యూఎస్‌కు చెందిన కోవాక్స్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, సరఫరాలకు హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా యూబీ-612 పేరుతో అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్ తయారీ, పంపణీలను చేపట్టనున్నట్లు అరబిందో పేర్కొంది. దీనిలో భాగంగా యునిసెఫ్‌కు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగానూ కరోనా కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల తయారీ, పంపిణీకి వీలుగా ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే ఇతర వర్ధమాన దేశాలకు సంబంధించి నాన్ఎక్స్క్లూజివ్ హక్కులు లభించినట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా యూబీ-612 వ్యాక్సిన్ క్లినికల్ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌లను దేశీయంగా అరబిందో చేపట్టనుంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం తొలి దశల క్లినికల్ పరీక్షలలో ఉన్నట్లు తెలుస్తోంది. (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) 2021లో.. యునైటెడ్ బయోమెడికల్ ఇంక్‌కు చెందిన కోవాక్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో చివరి దశ క్లినికల్ పరీక్షలను చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తొట్టతొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత ఈ వ్యాక్సిన్‌ను సాధారణ రిఫ్రిజిరేషన్లలో భద్రపరిచేందుకు వీలుంటుందని అరబిందో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ 22 కోట్ల డోసేజీల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. 2021 జూన్‌కల్లా 48 కోట్ల డోసేజీల తయారీకి విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్డర్లు లభించినట్లు కోవాక్స్ వెల్లడించింది. తద్వారా బ్రెజిల్, పెరూ, ఈక్వడార్ తదితర వర్ధమాన మార్కెట్లకు 14 కోట్ల డోసేజీలకుపైగా సరఫరా చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. -
అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ
ముంబై: ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు పతనమై 43,301కుచేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు క్షీణించి 12,687 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అరబిందో ఫార్మా నికర లాభం 26 శాతం ఎగసి రూ. 806 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6,483 కోట్లను అధిగమించాయి. వాటాదారులకు సైతం షేరుకి రూ. 1.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 864ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 854 వద్ద ట్రేడవుతోంది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐబీ హౌసింగ్ నికర లాభం 54 శాతం క్షీణించి రూ. 323 కోట్లకు పరిమితమైంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 18.5 శాతం పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 26 శాతం తక్కువగా రూ. 2,581 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 174కు చేరింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 171 వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్ డౌన్- పాలీక్యాబ్- అరబిందో జోరు
తొలుత బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాలు పెరగడంతో కుదేలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమై 40,195కు చేరింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 11,780 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్ఎంఈజీ కంపెనీ పాలీక్యాబ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థ ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పాలీక్యాబ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో పాలీక్యాబ్ ఇండియా నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 222 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 2,114 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 25 శాతం పెరిగి రూ. 288 కోట్లను తాకగా.. ఇబిటా మార్జిన్లు 2.72 శాతం బలపడి రూ. 14.76 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాలీక్యాబ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.5 శాతం దూసుకెళ్లి రూ. 955 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 968 వరకూ ఎగసింది. అరబిందో ఫార్మా న్యూ మౌంటెయిన్ క్యాపిటల్, జారో ఫార్ములాస్‌తో బిజినెస్ యూనిట్ల విక్రయానికి యూఎస్ అనుబంధ సంస్థ నాట్రోల్ ఎల్ఎల్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మా తాజాగా పేర్కొంది. పూర్తి నగదు రూపంలో 55 కోట్ల డాలర్ల(రూ. 4048 కోట్లు)కు డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2021 జనవరికల్లా డీల్ పూర్తికావచ్చని వివరించింది. నిధులను రుణభార తగ్గింపు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనున్నట్లు అరబిందో వెల్లడించింది. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం లాభంతో రూ. 790 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 4 శాతం జంప్‌చేసి రూ. 815కు చేరింది. -
అరబిందో ఫార్మా- హెమిస్ఫియర్.. బోర్లా
నాలుగు రోజుల వరుస లాభాలకు చెక్ చెబుతూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 40,555కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 11,883 వద్ద ట్రేడవుతోంది. కాగా.. న్యూజెర్సీ ప్లాంటుపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క పీఎస్‌యూ వీఎస్ఎన్ఎల్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన తొలి రోజే హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా న్యూజెర్సీ, డేటన్లోని ఓరల్ సాలిడ్ తయారీ కేంద్రంపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో అరబిందో ఫార్మా కౌంటర్ డీలా పడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో షేరు 5.5 శాతం పతనమై రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.5 శాతం నీరసించి రూ. 754 దిగువకు చేరింది. డేటన్ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది జనవరి 13- ఫిబ్రవరి 12న తనఖీలు చేపట్టింది. 9 లోపాలను గుర్తిస్తూ జూన్ 4న ఓఏఐతో కూడిన ఫామ్ 483ను జారీ చేసింది. కాగా.. అరబిందో ఫార్మా మొత్తం టర్నోవర్‌లో ఈ ప్లాంటు వాటా 2 శాతమేనని.. కంపెనీ కార్యకలాపాలపై ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ పీఎస్‌యూ వీఎస్ఎన్ఎల్(ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్) నుంచి ప్రత్యేక కంపెనీగా విడదీసిన హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్(హెచ్‌పీఐఎల్) నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. అయితే అటు బీఎస్ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలలలో అమ్మకాలు ఊపందుకోవడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్లను తాకింది. బీఎస్ఈలో రూ. 106 వద్ద లిస్టయిన షేరు రూ. 5.3 కోల్పయి రూ. 101 దిగువన ఫ్రీజయ్యింది. ఇక ఎన్ఎస్ఈలో రూ. 97 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 5 నష్టంతో రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్‌పీఐఎల్ చేతిలో దాదాపు 740 ఎకరాల భూమిని కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 26 శాతానికిపైగా వాటా ఉంది. ఇదే విధంగా టాటా గ్రూప్ కంపెనీలకు దాదాపు 49 శాతం వాటా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఈక్లర్క్స్ హైజంప్- అరబిందో డీలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ హెల్త్‌కేర్ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈక్లర్క్స్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. అరబిందో అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఈక్లర్క్స్ సర్వీసెస్ నికర లాభం 30 శాతం ఎగసి రూ. 52 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం తక్కువగా రూ. 348 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 12 శాతం నీరసించి దాదాపు 45 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఈక్లర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 104 జమ చేసుకుని రూ. 623 వద్ద ఫ్రీజయ్యింది. అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అరబిందో ఫార్మా నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5925 కోట్లను తాకింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 1.25 డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం ఆదాయంలో యూఎస్ వాటా 16 శాతం ఎగసి రూ. 3107 కోట్లను అధిగమించినట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్-19 కాలంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించగలిగినట్లు తెలియజేసింది. అయితే ఎన్ఎస్ఈలో ప్రస్తుతం అరబిందో షేరు 3.2 శాతం క్షీణించి రూ. 904 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4.7 శాతం పతనమై రూ. 890 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చేరింది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు.