ఈ ఏడాది పెట్టుబడులురూ. 1,200 కోట్లు
♦ ఆర్‌అండ్‌డీకి ఆదాయంలో 4.5 శాతం
♦ అరబిందో ఫార్మా వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల విస్తరణపై సుమారు రూ. 1,200 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు అరబిందో ఫార్మా ఎండీ గోవిందరాజన్ వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఆదాయంలో 4-4.5 శాతం మేర వెచ్చించనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆయన వివరించారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలో ఇంజెక్టబుల్స్ విభాగంలో లెవోఫ్లోక్సాసిన్, ఎసిటిల్‌సిస్టీన్ వంటి దాదాపు తొమ్మిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ చెప్పారు. మరోవైపు, వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఫినిష్డ్ డోసేజీ ప్లాంటుకు జీఎంపీ అనుమతులు వచ్చాయని, ఉత్పత్తులకు ఒక్కొక్కటిగా అనుమతులు వస్తున్నాయని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఎగుమతులు ప్రారంభం కాగలవని గోవింద రాజన్ పేర్కొన్నారు. ఇక, నాయుడుపేట ప్లాంటు కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. దాదాపు 6.8 బిలియన్ డాలర్ల విలువ చేసే మార్కెట్‌కు సంబంధించి 19 ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నామని.. వీటిలో కీలకమైన నెక్సియం ఔషధం మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని వివరించారు. ప్రస్తుతం యూరప్‌లో 200 పైగా ఉత్పత్తులు అభివృద్ధి దశల్లో ఉన్నాయని.. రాబోయే మూడు నాలుగేళ్లలో వీటిని మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ తెలిపారు.
జూన్ ఆఖరు నాటికి మొత్తం 403 జనరిక్ ఔషధాల తయారీకి దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) చేయగా.. 228 ఔషధాలకు తుది అనుమతులు, 41 జనరిక్స్‌కు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేర్కొన్నారు. గత త్రైమాసికంలో మూడు ఔషధాలకు అనుమతులు వచ్చాయని, మిగతా వ్యవధిలో మరిన్నింటికి అనుమతులు రాగలవని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అరబిందో ఫార్మా లాభాలు సుమారు 24 శాతం వృద్ధితో రూ. 585 కోట్లకు, ఆదాయాలు రూ. 3,299 కోట్ల నుంచి రూ. 3,726 కోట్లకు చేరాయి.