R&D
-
ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్ కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది. అలాగే, ప్రైవేట్ రంగం ఆర్అండ్డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని.. ► ఆర్అండ్డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు? ► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ► భారత్‌లో పేటెంట్ ఫైలింగ్ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? -
సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ ఆర్అండ్డీ కార్యకలాపాలతోపాటు.. ఏపీఐలను రూపొందిస్తున్న కంపెనీ సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 104 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంపన్న వర్గాల విభాగంలో 161 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 56 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలోనూ 32 రెట్లు స్పందన కనిపించింది. షేరుకి రూ. 265–274 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 700 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని వాటాదారులు, ప్రమోటర్లు ఆఫర్ చేయడంతోపాటు, మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. గత బుధవారం(15న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ. 315 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఈక్విటీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
నమ్మితే నట్టేట ముంచాడు
వైఎస్ఆర్ జిల్లా , పోరుమామిళ్ల: స్థానిక పోస్టాఫీసులో ఆర్డీ ఏజెంటుగా పని చేస్తున్న ముచ్చర్ల రాజేంద్రప్రసాద్ తమ ఖాతాలకు డిపాజిట్ డబ్బు జమ చేయకుండా స్వాహా చేశాడని సోమవారం పట్టణంలోని బెస్తవీధికి చెందిన మైనారిటీ మహిళలు పోస్టాఫీసు వద్ద లబోదిబోమంటూ గగ్గోలు పెట్టారు. అతనిపై నమ్మకంతో నెలనెలా డబ్బు ఇచ్చామని, పాసుబుక్కులు కూడా అతని వద్దే ఉండటంతో తమ ఖాతాల్లో జమ అయి ఉంటుందని నమ్మి మోసపోయామని కన్నీరు మున్నీరయ్యారు. నూర్జహాన్ అనే మహిళ మాట్లాడుతూ తాను రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. వెయ్యి, వెయ్యి చొప్పున నెలనెలా నాలుగు అకౌంట్లకు డబ్బు కట్టానన్నారు. లక్ష రూపాయలకు పైగా డిపాజిట్ చేశానని, ఇప్పుడు ఆ డబ్బు ఏజెంట్ పోస్టాఫీసులో కట్టలేదని వాపోయింది. కష్టం చేసుకుని సంపాదింది, కూడబెట్టుకుంటే రాజేంద్ర మోసం చేశాడని బోరుమంది. కరీమున్, పర్వీన్‌లకు చెందిన డిపాజిట్ డబ్బు కొంతమాత్రమే జమ అయిందని, రూ. 5 వేల డిపాజిట్ 11 నెలలుగా పోస్టాఫీసులో జమకాలేదని వాపోయారు. మహబూబున్నీ నెల నెలా రూ. వెయ్యి కడుతోంది. అందులో ఎంత ఉందో, ఎంత స్వాహా అయిందోనని ఆందోళన వ్యక్తం చేసింది. అనమలశెట్టి సుబ్బరత్నమ్మకు సేవింగ్ అకౌంట్, రికరింగ్ అకౌంటు ఉండగా, పాస్‌బుక్‌లో ఉన్న సేవింగ్ మొత్తం కరెక్టుగా ఉంది. కానీ ఆర్డి బుక్ ఏజంటు వద్దే ఉండటంతో ఆ డబ్బు స్వాహా చేశాడని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. ఈ విషయమై పోస్టుమాస్టర్ ఖాదర్‌బాషాను విచారించగా రాజేంద్ర వద్ద ఖాతాదారులు పాసుబుక్కులు పెట్టడం పొరపాటన్నారు. ఎవరి పాసుబుక్కులు వారి వద్దే ఉంటే నెలనెలా ఖాతాకు జమ అయిందా? లేదా పరిశీలించుకునే అవకాశం ఉంటుందన్నారు. పోస్టాఫీసులో జమ చేసిన మొత్తానికి మాత్రమే తమ జవాబుదారీ ఉంటుందని, జమ చేయకుండా స్వాహా చేసిన మొత్తానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం కొంతమంది తెలుసుకుని అతన్ని నిలదీయగా శనివారం కొంతడబ్బు కొందరి అకౌంట్లల్లో జమ చేశాడన్నారు. అనుమానం ఉన్నవారు పోస్టాఫీసుకు వచ్చి అకౌంటు పరిశీలించుకోవచ్చన్నారు. ఆర్డీ అకౌంట్లకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ భూపాల్‌రెడ్డి సోమవారం విధులకు రాలేదు. అతను వస్తే ఎన్ని అకౌంట్లు రాజేంద్ర నిర్వహిస్తున్నదీ తెలుస్తుందని కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. -
భారత్‌లో ఇంటెల్ భారీ పెట్టుబడులు
సాక్షి, బెంగళూరు: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆర్అండ్డీపై బెంగళూరులో అత్యాధునిక డిజైన్ హౌస్ నిర్మాణానికి రూ. 1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పటిష్టం కావడానికి, అపార ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ స్థాయి పెట్టుబడులు దోహదపడగలవని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య చెప్పారు. -
ఈ ఏడాది పెట్టుబడులురూ. 1,200 కోట్లు
♦ ఆర్‌అండ్‌డీకి ఆదాయంలో 4.5 శాతం ♦ అరబిందో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల విస్తరణపై సుమారు రూ. 1,200 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు అరబిందో ఫార్మా ఎండీ గోవిందరాజన్ వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఆదాయంలో 4-4.5 శాతం మేర వెచ్చించనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆయన వివరించారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలో ఇంజెక్టబుల్స్ విభాగంలో లెవోఫ్లోక్సాసిన్, ఎసిటిల్సిస్టీన్ వంటి దాదాపు తొమ్మిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ చెప్పారు. మరోవైపు, వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఫినిష్డ్ డోసేజీ ప్లాంటుకు జీఎంపీ అనుమతులు వచ్చాయని, ఉత్పత్తులకు ఒక్కొక్కటిగా అనుమతులు వస్తున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఎగుమతులు ప్రారంభం కాగలవని గోవింద రాజన్ పేర్కొన్నారు. ఇక, నాయుడుపేట ప్లాంటు కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. దాదాపు 6.8 బిలియన్ డాలర్ల విలువ చేసే మార్కెట్‌కు సంబంధించి 19 ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నామని.. వీటిలో కీలకమైన నెక్సియం ఔషధం మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని వివరించారు. ప్రస్తుతం యూరప్‌లో 200 పైగా ఉత్పత్తులు అభివృద్ధి దశల్లో ఉన్నాయని.. రాబోయే మూడు నాలుగేళ్లలో వీటిని మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ తెలిపారు. జూన్ ఆఖరు నాటికి మొత్తం 403 జనరిక్ ఔషధాల తయారీకి దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) చేయగా.. 228 ఔషధాలకు తుది అనుమతులు, 41 జనరిక్స్‌కు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేర్కొన్నారు. గత త్రైమాసికంలో మూడు ఔషధాలకు అనుమతులు వచ్చాయని, మిగతా వ్యవధిలో మరిన్నింటికి అనుమతులు రాగలవని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అరబిందో ఫార్మా లాభాలు సుమారు 24 శాతం వృద్ధితో రూ. 585 కోట్లకు, ఆదాయాలు రూ. 3,299 కోట్ల నుంచి రూ. 3,726 కోట్లకు చేరాయి. -
టర్నోవర్‌లో 3% ఆర్‌అండ్‌డీకి
అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తయారీ * హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హావెల్స్ ఇండియా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీకై ఏటా టర్నోవర్‌లో 3 శాతం ఆర్అండ్డీపై వెచ్చిస్తోంది. నాణ్యతతోపాటు విద్యుత్‌ను తక్కువగా వినియోగించే ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్టు హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్ శర్మ మంగళవారమిక్కడ తెలిపారు. నూతన శ్రేణి స్విచ్గేర్లను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నోయిడాలో కేంద్ర ఆర్అండ్డీ ఉంది. అలాగే చైనా, యూరప్‌లో మరో నాలుగు ప్రధాన ఆర్‌అండ్‌డీలు ఉన్నాయి. నోయిడా కేంద్రంలో 200 మంది నిపుణులు పనిచేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ప్రపంచస్థాయి ఉత్పత్తులను కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగా కంపెనీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది’ అని చెప్పారు. 2014-15లో హావెల్స్ రూ.8,500 కోట్ల టర్నోవర్ సాధించింది. నిర్మాణ రంగంలో కదలికతో.. దేశీయంగా కొన్నేళ్లుగా నిర్మాణ రంగం స్తబ్ధుగా ఉంది. వడ్డీ రేట్లు తగ్గుదల వల్ల ఈ రంగంలో కదలిక వస్తే బిల్డింగ్ ఎలక్ట్రికల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎ.వి.జగదీశ్ తెలిపారు. భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. హావెల్స్ గెలాక్సీ స్టోర్లు దేశవ్యాప్తంగా 330 ఉన్నాయి. డిసెంబర్‌కల్లా వీటి సంఖ్యను 400లకు చేరుస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏపీ, తెలంగాణలో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 28కి పెరుగుతుందని వివరించారు. గెలాక్సీ స్టోర్ల ద్వారా సంస్థకు 2014-15లో రూ.750 కోట్లు సమకూరింది. ఇక ఏపీ, తెలంగాణ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ నమోదైందని హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ ఎ.వి.రావు తెలిపారు. -
ఎల్జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది భారత్‌లో రూ. 23,500 కోట్ల టర్నోవరును లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అధికం. 2014లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా టర్నోవరు రూ. 18,500 కోట్లు. ఇక, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యకలాపాలపై కంపెనీ ఈ ఏడాది కనీసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం ఎల్జీ ఇండియా టెక్ షో 2015 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ వాన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ను తమకు మూడో అతి పెద్ద మార్కెట్‌గా మల్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాన్ వివరించారు. 105 అంగుళాల టీవీ..: టెక్‌షోలో భాగంగా మొబైల్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్, ఎయిర్ కండీషనర్స్, గృహోపకరణాలకు సంబంధించి 4 కొత్త ఉత్పత్తులను ఎల్జీ ఆవిష్కరించింది. తమ రెండో కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ జీ ఫ్లెక్స్2ని, 105 అంగుళాల టీవీని ప్రవేశపెట్టింది. జీ ఫ్లెక్స్ ధర రూ. 55,000 కాగా టీవీ రేటు రూ. 60 లక్షలు. మొబైల్స్ విభాగంలో ఈ ఏడాది 30 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వాన్ తెలిపారు.