మోసపోయామని విలపిస్తున్న నూర్జహాన్, సుబ్బరత్నమ్మలు
వైఎస్‌ఆర్ జిల్లా , పోరుమామిళ్ల: స్థానిక పోస్టాఫీసులో ఆర్‌డీ ఏజెంటుగా పని చేస్తున్న ముచ్చర్ల రాజేంద్రప్రసాద్ తమ ఖాతాలకు డిపాజిట్ డబ్బు జమ చేయకుండా స్వాహా చేశాడని సోమవారం పట్టణంలోని బెస్తవీధికి చెందిన మైనారిటీ మహిళలు పోస్టాఫీసు వద్ద లబోదిబోమంటూ గగ్గోలు పెట్టారు. అతనిపై నమ్మకంతో నెలనెలా డబ్బు ఇచ్చామని, పాసుబుక్కులు కూడా అతని వద్దే ఉండటంతో తమ ఖాతాల్లో జమ అయి ఉంటుందని నమ్మి మోసపోయామని కన్నీరు మున్నీరయ్యారు.
నూర్జహాన్ అనే మహిళ మాట్లాడుతూ తాను రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. వెయ్యి, వెయ్యి చొప్పున నెలనెలా నాలుగు అకౌంట్లకు డబ్బు కట్టానన్నారు. లక్ష రూపాయలకు పైగా డిపాజిట్ చేశానని, ఇప్పుడు ఆ డబ్బు ఏజెంట్ పోస్టాఫీసులో కట్టలేదని వాపోయింది. కష్టం చేసుకుని సంపాదింది, కూడబెట్టుకుంటే రాజేంద్ర మోసం చేశాడని బోరుమంది.
కరీమున్, పర్వీన్‌లకు చెందిన డిపాజిట్ డబ్బు కొంతమాత్రమే జమ అయిందని, రూ. 5 వేల డిపాజిట్ 11 నెలలుగా పోస్టాఫీసులో జమకాలేదని వాపోయారు. మహబూబున్నీ నెల నెలా రూ. వెయ్యి కడుతోంది. అందులో ఎంత ఉందో, ఎంత స్వాహా అయిందోనని ఆందోళన వ్యక్తం చేసింది.
అనమలశెట్టి సుబ్బరత్నమ్మకు సేవింగ్ అకౌంట్, రికరింగ్ అకౌంటు ఉండగా, పాస్‌బుక్‌లో ఉన్న సేవింగ్ మొత్తం కరెక్టుగా ఉంది. కానీ ఆర్‌డి బుక్ ఏజంటు వద్దే ఉండటంతో ఆ డబ్బు స్వాహా చేశాడని ఆమె ఆవేదన వెలిబుచ్చింది.
ఈ విషయమై పోస్టుమాస్టర్ ఖాదర్‌బాషాను విచారించగా రాజేంద్ర వద్ద ఖాతాదారులు పాసుబుక్కులు పెట్టడం పొరపాటన్నారు. ఎవరి పాసుబుక్కులు వారి వద్దే ఉంటే నెలనెలా ఖాతాకు జమ అయిందా? లేదా పరిశీలించుకునే అవకాశం ఉంటుందన్నారు. పోస్టాఫీసులో జమ చేసిన మొత్తానికి మాత్రమే తమ జవాబుదారీ ఉంటుందని, జమ చేయకుండా స్వాహా చేసిన మొత్తానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం కొంతమంది తెలుసుకుని అతన్ని నిలదీయగా శనివారం కొంతడబ్బు కొందరి అకౌంట్లల్లో జమ చేశాడన్నారు. అనుమానం ఉన్నవారు పోస్టాఫీసుకు వచ్చి అకౌంటు పరిశీలించుకోవచ్చన్నారు. ఆర్‌డీ అకౌంట్లకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ భూపాల్‌రెడ్డి సోమవారం విధులకు రాలేదు. అతను వస్తే ఎన్ని అకౌంట్లు రాజేంద్ర నిర్వహిస్తున్నదీ తెలుస్తుందని కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment