న్యూఢిల్లీ: ఫార్మా రంగ ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలతోపాటు.. ఏపీఐలను రూపొందిస్తున్న కంపెనీ సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 104 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం సంపన్న వర్గాల విభాగంలో 161 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 56 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలోనూ 32 రెట్లు స్పందన కనిపించింది.
షేరుకి రూ. 265–274 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 700 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని వాటాదారులు, ప్రమోటర్లు ఆఫర్ చేయడంతోపాటు, మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. గత బుధవారం(15న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ. 315 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఈక్విటీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment