నాలుగు రోజుల వరుస లాభాలకు చెక్ చెబుతూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 40,555కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 11,883 వద్ద ట్రేడవుతోంది. కాగా.. న్యూజెర్సీ ప్లాంటుపై యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క పీఎస్‌యూ వీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన తొలి రోజే హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వివరాలు చూద్దాం..
అరబిందో ఫార్మా
న్యూజెర్సీ, డేటన్‌లోని ఓరల్ సాలిడ్ తయారీ కేంద్రంపై యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో అరబిందో ఫార్మా కౌంటర్ డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అరబిందో షేరు 5.5 శాతం పతనమై రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.5 శాతం నీరసించి రూ. 754 దిగువకు చేరింది. డేటన్ ప్లాంటులో యూఎస్ఎఫ్‌డీఏ ఈ ఏడాది జనవరి 13- ఫిబ్రవరి 12న తనఖీలు చేపట్టింది. 9 లోపాలను గుర్తిస్తూ జూన్ 4న ఓఏఐతో కూడిన ఫామ్ 483ను జారీ చేసింది. కాగా.. అరబిందో ఫార్మా మొత్తం టర్నోవర్‌లో ఈ ప్లాంటు వాటా 2 శాతమేనని.. కంపెనీ కార్యకలాపాలపై ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి.
హెమిస్ఫియర్ ప్రాపర్టీస్
పీఎస్‌యూ వీఎస్‌ఎన్‌ఎల్(ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్) నుంచి ప్రత్యేక కంపెనీగా విడదీసిన హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్(హెచ్‌పీఐఎల్) నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. అయితే అటు బీఎస్‌ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలలలో అమ్మకాలు ఊపందుకోవడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్లను తాకింది. బీఎస్‌ఈలో రూ. 106 వద్ద లిస్టయిన షేరు రూ. 5.3 కోల్పయి రూ. 101 దిగువన ఫ్రీజయ్యింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో రూ. 97 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 5 నష్టంతో రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్‌పీఐఎల్ చేతిలో దాదాపు 740 ఎకరాల భూమిని కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 26 శాతానికిపైగా వాటా ఉంది. ఇదే విధంగా టాటా గ్రూప్ కంపెనీలకు దాదాపు 49 శాతం వాటా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment