
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది.
ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్‌లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment