GRANULES INDIA
-
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద.. రూ.2వేల కోట్లతో గ్రాన్యూల్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్ తాజాగా గ్రీన్కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి, గ్రీన్కో గ్రూప్ ఫౌండర్ మహేశ్ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. -
గ్రాన్యూల్స్ ఇండియా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 111 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 16 శాతం పుంజుకుని రూ. 850 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 736 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 0.25 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. -
కార్లయిల్ చేతికి గ్రాన్సూల్స్ ఇండియా!
ముంబై, సాక్షి: ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఏపీఐలు, కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు కలిగిన గ్రాన్యూల్స్ ఇండియలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. ఈ వాటా కొనుగోలుకి కార్లయిల్ గ్రూప్ ఇప్పటికే చర్చలు చేపట్టినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. చర్చలు తుది దశకు చేరినట్లు తెలియజేశాయి. అయితే ఈ వార్తలపై గ్రాన్సూల్స్ ఇండియా స్పందించకపోగా.. కంపెనీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని వెల్లడించింది. బిలియన్ డాలర్లు హైదరాబాద్ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాను కొనుగోలు చేసేందుకు కార్లయిల్ గ్రూప్ బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. కంపెనీలో ప్రమోటర్లకున్న మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే.. సెబీ నిబంధనల ప్రకారం కార్లయిల్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. సాధారణ వాటాదారుల నుంచి సైతం మరో 24 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుందని ప్రస్తావించారు. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న గ్రాన్సూల్స్ ఇండియా షేరు ఈ నేపథ్యంలో మరోసారి జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 6 శాతం జంప్‌చేసి రూ. 438కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 428 వద్ద ట్రేడవుతోంది. బయ్ రేటింగ్ గ్రాన్సూల్స్ ఇండియా కౌంటర్‌కు రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బయ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ముడిసరుకుల కోసం చేపట్టిన బ్యాక్వార్డ్ ఇంటిగ్రేషన్ కంపెనీకి బలాన్ని చేకూర్చనున్నట్లు పేర్కొంది. తద్వారా పోటీ తీవ్రంగా ఉండే జనరిక్ మార్కెట్లో కంపెనీ బలంగా నిలవగలదని అభిప్రాయపడింది. మరిన్ని క్లిష్టతరమైన(కాంప్లెక్స్) ప్రొడక్టుల తయారీలోకి ప్రవేశించడం ద్వారా మార్జిన్లను మెరుగుపరచుకునే వీలున్నట్లు తెలియజేసింది. మార్జిన్లు కొనసాగితే.. విస్తరణకు అవసరమైన క్యాష్‌ఫ్లోకు అవకాశముంటుందని అభిప్రాయపడింది. ఈ అంశాల నేపథ్యంలో గ్రాన్సూల్స్ షేరుకి రూ. 460 టార్గెట్ ధరను అంచనా వేస్తోంది. -
ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడు తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపం చంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుంది. వేయి కోట్ల ఫినిష్డ్ డోస్‌లను కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తామని గ్రాన్యూల్స్ ఇండియా ప్రకటించింది. తమ తాజా యూనిట్‌ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణప్రసాద్ వెల్ల డించారు. మరోవైపు లారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెల కొల్పింది. ఇక్కడ యాంటీ రిట్రోవైరల్, అంకా లజీ, కార్డియోవా స్క్యులార్, యాంటీ డయా బెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంటరాల జీకి సంబంధించిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడి యెంట్లను తయారు చేస్తుంది. ఉపాధి పెరుగుతుంది: కేటీఆర్ గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్ పెట్టు బడులతో తయారీ రంగంలో స్థానిక యువ తకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫార్మా సహా వివిధ రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రకటించారు. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ మంగళవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నూతన పెట్టుబడుల గురించి వివరించారు. -
గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్ బైండింగ్ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు. వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది. -
గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!
ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి గ్లోబల్ పీఈ సంస్థలు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీఐ, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియాను కొనుగోలు చేసేందుకు పీఈ దిగ్గజాలు ప్రాథమిక ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పీఈ దిగ్గజాలూ నాన్‌బైండింగ్ బిడ్స్‌ను దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీలో మెజారిటీ వాటా విక్రయం కోసం గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలు చూద్దాం.. షేరు జూమ్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా కౌంటర్‌కు తాజాగా డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.4 శాతం దూసుకెళ్లి రూ. 395ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 375 వద్ద ట్రేడవుతోంది. కాగా.. పారాసెట్మల్ ఔషధ తయారీలో ప్రపంచస్థాయి కంపెనీగా గ్రాన్యూల్స్ నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది క్యూ1లో కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు మెట్ఫార్మిన్, పారాసెట్మల్, ఇబుప్రోఫిన్ వంటి ఔషధాలకు ఏర్పడిన డిమాండ్ కారణమైనట్లు పేర్కొన్నారు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 42.13 శాతం వాటాను కలిగి ఉన్నారు. గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ దిగ్గజాల మధ్య పోటీ నెలకొనే వీలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే గ్రాన్యూల్స్ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై స్పందిస్తూ.. మార్కెట్ అంచనాలపై మాట్లాడబోమన్నారు. అవసరమైనప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారాన్ని అందించగలమని స్పష్టం చేశారు. పీఈ హవా ముంబై ఫార్మా కంపెనీ జేబీ కెమికల్స్‌లో 54 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు 2020 జులైలో పీఈ దిగ్గజం కేకేఆర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 3,100 కోట్లను వెచ్చించనుంది. ఐపీవో యోచనను వాయిదా వేసిన పుణే కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాలో గతంలోనే బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క దేశీయంగా రియల్టీ రంగంలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ పలు వాణిజ్య ప్రాజెక్టులను కలిగి ఉంది. వెరసి పీఈ కంపెనీలు దేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
అమెరికా సంస్థతో గ్రాన్యూల్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మా (జీపీఐ) ద్వారా ఈ లావాదేవీ పూర్తి చేసినట్లు తెలిపింది. అమెరికాలో ఈ నాలుగు ఉత్పత్తుల వార్షిక అమ్మకాలు సుమారు 4.4 బిలియన్ డాలర్లుగా ఉంటాయి. విక్రయాల ద్వారా వచ్చే లాభాల్లో యూఎస్‌ఫార్మా విండ్లాస్కు వాటాలు, నిర్దిష్ట మైలురాళ్లను దాటిన అనంతరం ప్రత్యేకంగా చెల్లింపులు ఉంటాయి. అమెరికా మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే దిశగా ఈ తరహా దీర్ఘకాలిక భాగస్వామ్య వ్యూహాలను అమలు చేస్తున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు. -
గ్రాన్యూల్స్ ఇండియా లాభం 48% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాలుగో త్రైమాసికంలో ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం సుమారు 48 శాతం వృద్ధితో రూ. 33 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 22 కోట్లు. ఇక ఆదాయం రూ. 354 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ. 373 కోట్లకు పెరిగింది. మరోవైపు, రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై 20 పైసల తుది డివిడెండును కంపెనీ బోర్డు ప్రకటించింది. 15 పైసల చొప్పున ప్రకటించిన మూడు మధ్యంతర డివిడెండ్లకు ఇది అదనమని సంస్థ వివరించింది. ఆదాయాల పెరుగుదల ఒక మోస్తరుగా ఉన్నా.. మార్జిన్ల తోడ్పాటుతో లాభాలు మెరుగ్గా నమోదయ్యాయని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు. అటు అనుబంధ విదేశీ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మాలో మరో 17.07 మిలియన్ డాలర్లు, జీఐఎల్ లైఫ్సెన్సైస్లో అదనంగా రూ. 50 కోట్ల పెట్టుబడులకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. గ్రాన్యూల్స్ ఇండియాలో జీఐఎల్ లైఫ్‌సెన్సైస్ విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర వేసింది. -
గ్రాన్యూల్స్ ఇండియా చేతికి ఆక్టస్ ఫార్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా తాజాగా ఆక్టస్ ఫార్మాను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ డీల్ విలువ సుమారు రూ. 120 కోట్లు ఉంటుంది. కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి 3-6 నెలలు పట్టవచ్చని గ్రాన్యూల్స్ ఇండియా ఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఔషధంలో కీలక భాగంగా ఉండే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారు చేసే ఆక్టస్ ఫార్మాకి.. వైజాగ్‌లోని ఫార్మా సిటీలోను హైదరాబాద్‌లోను ప్లాంట్లు ఉన్నాయి. వైజాగ్‌లోని ఆక్టస్ ప్లాంటుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏతో పాటు ఇతర దేశాల నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు తమకు మరింతగా ఉపయోగకరంగా ఉండగలదని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆక్టస్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 12 ఏపీఐలు ఉన్నాయి. 50 దేశాల్లోని కస్టమర్లకు విక్రయిస్తోంది. మరోవైపు, జనరిక్ ఏపీఐలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లో 10,000 చ.అ. ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది.