గ్రాన్యూల్స్ ఇండియా లాభం 48% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాలుగో త్రైమాసికంలో ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం సుమారు 48 శాతం వృద్ధితో రూ. 33 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 22 కోట్లు. ఇక ఆదాయం రూ. 354 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ. 373 కోట్లకు పెరిగింది. మరోవైపు, రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై 20 పైసల తుది డివిడెండును కంపెనీ బోర్డు ప్రకటించింది. 15 పైసల చొప్పున ప్రకటించిన మూడు మధ్యంతర డివిడెండ్లకు ఇది అదనమని సంస్థ వివరించింది.
ఆదాయాల పెరుగుదల ఒక మోస్తరుగా ఉన్నా.. మార్జిన్ల తోడ్పాటుతో లాభాలు మెరుగ్గా నమోదయ్యాయని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు. అటు అనుబంధ విదేశీ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మాలో మరో 17.07 మిలియన్ డాలర్లు, జీఐఎల్ లైఫ్‌సెన్సైస్‌లో అదనంగా రూ. 50 కోట్ల పెట్టుబడులకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. గ్రాన్యూల్స్ ఇండియాలో జీఐఎల్ లైఫ్‌సెన్సైస్ విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర వేసింది.