అరబిందో లాభం రూ.595 కోట్లు | Aurobindo's profit was Rs 595 crore | Sakshi
Sakshi News home page

అరబిందో లాభం రూ.595 కోట్లు

Published Thu, Feb 8 2018 1:15 AM | Last Updated on Thu, Feb 8 2018 1:15 AM

Aurobindo's profit was Rs 595 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 2.8 శాతం పెరిగి రూ.595 కోట్లకు చేరింది. టర్నోవర్‌ 11 శాతం పెరిగి రూ.4,336 కోట్లకు ఎగసింది.

2017–18 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ.12,450 కోట్ల టర్నోవరుపై సంస్థ రూ.1,894 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఫార్ములేషన్‌ అమ్మకాల్లో యూఎస్‌ 9.4 శాతం, యూరప్‌ 37 శాతం వృద్ధిని కనబరిచాయి. కీలక మార్కెట్లు చక్కని పనితీరు కొనసాగిస్తున్నాయని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1 రెండవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.

మూడింతలైన గాయత్రి లాభం
డిసెంబర్‌ క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో గాయత్రి ప్రాజెక్ట్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పెరిగి రూ.46.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.521 కోట్ల నుంచి రూ.908 కోట్లకు ఎగసింది. 2017–18 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ.1,992 కోట్ల టర్నోవరుపై రూ.115 కోట్ల నికరలాభం నమోదైంది.

స్వల్పంగా తగ్గిన హెచ్‌బీఎల్‌ లాభం..
డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.9.6 కోట్ల నుంచి రూ.8.8 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.385 కోట్ల నుంచి రూ.417 కోట్లకు ఎగసింది.  
కావేరీ లాభం రూ.6.9 కోట్లు..
గడచిన త్రైమాసికంలో కావేరీ సీడ్‌ కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే రూ.5.2 కోట్ల నుంచి రూ.6.9 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.78 కోట్ల నుంచి రూ.72 కోట్లకు వచ్చి చేరింది.  

ఓల్టాస్‌ లాభం రూ.100 కోట్లు
న్యూఢిల్లీ:
టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.100 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం రూ.82 కోట్లతో పోలిస్తే నికర లాభం ఈ క్యూ3లో 23 శాతం వృద్ధి చెందిందని ఓల్టాస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,375 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 43 శాతం వృద్ధితో రూ.119 కోట్లకు, ఇబిటా మార్జిన్‌ 1.5 శాతం వృద్ధితో 8.6 శాతానికి పెరిగాయి. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా, బీఎస్‌ఈలో ఓల్టాస్‌ షేర్‌ 2.4 శాతం లాభపడి రూ.600 వద్ద ముగిసింది.

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో వంద శాతం వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.23 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ క్యూ3లో రూ.46 కోట్లకు పెరిగిందని రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగినట్లు కంపెనీ ఈడీ, సీఈఓ రవీంద్ర సుధాల్కర్‌ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.270 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.421 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్‌ 1 శాతం లాభంతో రూ.69 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement