
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12% తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3%గా ఉంది. యూఎస్, యూరప్ మార్కెట్ జోష్ కంపెనీకి తోడైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199 కోట్లు నమోదైంది.
ఏపీఐల విక్రయం ద్వారా రూ.748 కోట్లు సమకూరింది. పరిశోధన, అభివృద్ధికి రూ.169 కోట్లు వ్యయం చేశారు. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి 13 ఏఎన్‌డీఏలకు తుది, 3 ఏఎన్‌డీఏలకు తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది. కొన్ని రకాల ఉత్పాదన సంబంధ నిబంధనల మూలంగా లాభంపై ప్రభావం చూపిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ వ్యాఖ్యానించారు.