ముంబై: ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు పతనమై 43,301కుచేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు క్షీణించి 12,687 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
అరబిందో ఫార్మా
ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అరబిందో ఫార్మా నికర లాభం 26 శాతం ఎగసి రూ. 806 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6,483 కోట్లను అధిగమించాయి. వాటాదారులకు సైతం షేరుకి రూ. 1.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 864ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 854 వద్ద ట్రేడవుతోంది.
ఐబీ హౌసింగ్ ఫైనాన్స్
ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐబీ హౌసింగ్ నికర లాభం 54 శాతం క్షీణించి రూ. 323 కోట్లకు పరిమితమైంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 18.5 శాతం పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 26 శాతం తక్కువగా రూ. 2,581 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 174కు చేరింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 171 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment