
అరబిందో చేతికి అమెరికా కంపెనీ
రూ. 810 కోట్లతో నాట్రోల్ కొనుగోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. నాట్రోల్‌కు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలో నాట్రోల్ అమ్మకానికి జరిగిన బిడ్డింగ్‌లో రూ. 810 కోట్లు (13.25 బిలియన్ డాలర్లు) కోట్ చేయడం ద్వారా అరబిందో ఫార్మా మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం కంపెనీ ఆస్తులు, బ్రాండ్‌తో పాటు కొన్ని రుణాలు కూడా అరబిందో పరం కానున్నాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌష్టికాహార మార్కెట్లో వేగంగా విస్తరించే అవకాశం లభిస్తుందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ తెలిపారు.