
అరబిందో ఫార్మా చేతికి అమెరికా కంపెనీ!
హైదరబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ దిగ్గజం అరబిందో ఫార్మా యూఎస్‌కు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్‌ను సొంతం చేసుకోనుంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నాట్రోల్ కొనుగోలుకి 13.25 కోట్ల డాలర్ల(రూ. 810 కోట్లు) ఆఫర్‌తో గరిష్ట బిడ్డర్‌గా అరబిందో నిలిచింది. అమెరికాలోని అనుబంధ సంస్థ ద్వారా బిడ్డింగ్‌ను దాఖలు చేసింది.
నాట్రోల్ కంపెనీ విక్రయానికి దివాళా సంబంధిత కేసులు చూసే అమెరికా డెలావేర్ జిల్లా కోర్టు తుది అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. నాట్రోల్ ఆస్తులను సొంతం చేసుకునేందుకు వేలం విధానంలో ఉత్తమ బిడ్డర్‌గా నిలిచినట్లు అరబిందో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నాట్రోల్‌కు చెందిన కొన్ని రుణాలు సైతం అరబిందోకు సంక్రమించనున్నాయి.
సమీకృత ఓటీసీకి చాన్స్
నాట్రోల్ కొనుగోలు ద్వారా అమెరికా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ఓటీసీ విభాగం పూర్తి స్థాయిలో పటిష్టం అవుతుందని అరబిందో పేర్కొంది. నాట్రోల్ అమెరికా, తదితర అంతర్జాతీయ మార్కెట్లకు పౌష్టికాహార ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నదని తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలు ద్వారా అరబిందో బ్రాండ్‌కు మంచి గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించింది. కాగా, నాట్రోల్ కొనుగోలు వార్తలతో బీఎస్‌ఈలో అరబిందో షేరు 3% పుంజుకుని రూ. 1,060 వద్ద ముగిసింది.