Eenadu Yellow Media And Ramoji Rao Fake News On Andhra Pradesh Govt - Sakshi
Sakshi News home page

ఎల్లో ఎజెండాకు లిక్కర్‌ కిక్కు

Published Mon, Nov 14 2022 3:38 AM | Last Updated on Mon, Nov 14 2022 9:24 AM

Eenadu Yellow Media Ramoji Rao Fake News On Andhra Pradesh Govt - Sakshi

మీడియా మారింది. జనానికి నిమిషాల్లో నిజాలు తెలుస్తున్నాయి. అయినా సరే... చంద్రబాబు ముఠాది పాత స్కీమే. తమ వ్యతిరేకులకు సంబంధించి నోటికొచ్చిన ఆరోపణలు చేయటం... అవన్నీ నిజాలైనట్లుగా పతాక శీర్షికల్లో ప్రచురించటం... వాటిని ప్రచారంలో పెట్టడం!!. అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్‌ చంద్రారెడ్డి ఢిల్లీలో అరెస్టయిన నాటి నుంచీ ఈ ఎల్లో ముఠాలకు పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. ఆ సంఘటనకు లేని లింకులు పెడుతూ... ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చిన ఆరోపణలకు దిగుతున్నారు. ఎద్దు ఈనిందంటే... దూడను కట్టేయమన్న చందంగా... అన్ని వేలకోట్లు, ఇన్ని వేల కోట్లు అంటూ చెలరేగిపోతున్నారు. ఈ ఎల్లో అరాచకాలపై విజయసాయిరెడ్డి వాస్తవాలను వెల్లడించారు. దుష్టచతుష్టయం ఎందుకిలా చెలరేగిపోతున్నదో... విశాఖ విషయంలోనూ ఎందుకు రోజూ విషం గక్కుతోందో నిజానిజాలు ఆయన మాటల్లోనే... 

అరబిందో ఫార్మాది 36 ఏళ్ల చరిత్ర. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలోని ఫార్మా కంపెనీల్లో టాప్‌–2 స్థాయికి చేరుకుంది. ఏడాదికి 2,600 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థలు ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్‌ చేసినా... ఇతర పెట్టుబడిదారులు ముందుకొస్తారు. అందుకే అవుకు, శింగనమల ప్రాంతాల్లో 800 మెగావాట్ల చొప్పున రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో అరబిందోకు ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా... 2000 కోట్లతో తొలిసారి భారతదేశంలో ‘పెన్సిలిన్‌–జి’ను ఉత్పత్తి చేసే ప్లాంటును కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేస్తోంది.

2024లో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కావచ్చునని సంస్థ ప్రకటించింది. ఇతర రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థకు పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టులిస్తే తప్పేంటి? దీనివల్ల రాష్ట్రానికి లాభమే కదా? ప్రాజెక్టు కోసం ప్రభుత్వ స్థలమిస్తే దానికి లీజు చెల్లిస్తారు. ప్రయివేటు స్థలాలైతే కొనుక్కుంటున్నారు. పైపెచ్చు ప్రతి మెగావాట్‌కు ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ప్రతి ఫలాన్ని ప్రభుత్వానికి కంపెనీయే చెల్లిస్తుంది. విద్యుత్‌కు అత్యధిక డిమాండ్‌ – అతి తక్కువ డిమాండ్‌ ఉన్నపుడు ఈ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు దాన్ని బ్యాలెన్స్‌ చేస్తాయి. దీనివల్ల గ్రిడ్‌ స్థిరంగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా రాష్ట్రానికి మంచిదే కదా?  

ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం? 
అరబిందో అనేది ప్రధానంగా వ్యాపార సంస్థ. దాదాపు ప్రపంచమంతటా దీని ఫార్మా వ్యాపారం విస్తరించి ఉంది. ఇతర వ్యాపారాల్లోనూ ఉంది. ఢిల్లీలో మద్యం సరఫరాకు టెండర్లు పిలిస్తే ఈ సంస్థ కూడా పాల్గొంది. అది తప్పేమీ కాదు కదా? టెండర్లు ఖరారయ్యాక కొన్ని నిబంధనల్లో సడలింపు ఇచ్చారనే ఆరోపణలు ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వానికి– కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. కొంత మేర తెలంగాణ ప్రభుత్వంపైనా ఆరోపణలొచ్చాయి.

మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం? కనీసం ఏపీ పేరును సీబీఐ గానీ, ఈడీ గానీ ఎక్కడా మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు కదా? మరి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం? విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడిని కంపెనీ ప్రతినిధిగా అరెస్టు చేసి ఉండొచ్చు. దాంతో విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? ఏ కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారైనా ఇవన్నీ ఆలోచిస్తారు కదా? అలాకాకుండా ప్రతిరోజూ తెలుగుదేశం నేతలు పనిగట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని దీన్లోకి లాగుతూ... వేల కోట్లంటూ పసలేని ఆరోపణలు చేయటం సమంజసమా? దాన్నొ ఉద్యమం మాదిరి ప్రచురిస్తున్న రామోజీరావు ఇంకెంత కిందికి దిగజారిపోతారు? ఒక పత్రికగా మీ బాధ్యత మీకు ఉండక్కర్లేదా? 


చంద్రబాబుతో సంబంధం ఉన్నట్టేగా? 
ఇదే అరబిందో గ్రూపును అభ్యర్థించి వారి భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా 2000వ సంవత్సరంలో తన కుటుంబీకుల చేత ఆంధ్రా ఆర్గానిక్స్‌ పెట్టించారు. మరి అరబిందో ఫార్మాతో  చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టేగా? ఇవెక్కడి తలతిక్క ఆరోపణలు? బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టిన చందాన ఏ వ్యవహారంలోనైనా పదేపదే అదాన్‌ డిస్టిలరీస్‌ పేరు తెరపైకి తెస్తోంది ఈ పచ్చ ముఠా.

అసలు ఈ అదాన్‌ డిస్టిలరీస్‌ ఎవరిది? దీన్ని ఏర్పాటు చేసింది అయ్యన్న పాత్రుడు కాదా? అసలు రాష్ట్రంలో మద్యం సరఫరా చేయటానికి అనుమతి ఇస్తూ 20 డిస్టిలరీలను ప్యానెల్‌లో చేరిస్తే... అందులో ఒక్కటంటే ఒక్కటైనా వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటయినది ఉందా? అందులో ఒక్క కంపెనీనైనా ఈ ప్రభుత్వం ప్యానెల్‌లో చేర్చిందా? అవన్నీ అప్పటికే ఏర్పాటయినవి కదా? చంద్రబాబు ప్రభుత్వమే ప్యానెల్‌లో చేర్చింది కదా? పెపెచ్చు ఆ 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటయ్యాయి.

అంటే వాటన్నిటి వెనకా చంద్రబాబు నాయుడి హస్తం ఉన్నట్టే కదా? తాను అధికారంలోంచి దిగిపోతూ కూడా ఈ డిస్టిలరీలపై ప్రేమ చావక బోలెడన్ని బ్రాండ్లకు అనుమతిస్తూ దిగిపోయాడు. ఇప్పుడేమో ఆ బ్రాండ్లను ఈ ప్రభుత్వానికి అంటగడుతూ తెలుగుదేశం నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం? మీడియా మీ చేతుల్లో ఉన్నంత మాత్రాన అబద్ధాలు నిజమైపోతాయా రామోజీరావు? 

ముడుపులన్నీ చంద్రబాబుకేగా? 
డిస్టిలరీలకు లైసెన్సులిచ్చి, వాటిని ఏర్పాటు చేశాక... వాటి నుంచి ప్రభుత్వం మద్యం కొనేందుకు వీలుగా వాటిని ప్యానెల్‌లో పెట్టిన చంద్రబాబుకు ముడుపులిస్తారా? లేకపోతే వాటినే కొనసాగిస్తున్న వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వానికి ముడుపులిస్తారా? ఇది తెలిసి కూడా తెలుగుదేశం నేతలు రోజూ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అదాన్‌ డిస్టిలరీస్‌ అనేది అయ్యన్న పాత్రుడికి సంబంధించిన సంస్థ అనే విషయాన్ని రాయరెందుకు రామోజీ? 

ఆ విషయాన్ని తెలుగుదేశం కూడా ఎప్పుడూ ప్రస్తావించదెందుకు?  
► ఇక ఆంధ్రప్రదేశ్‌ బ్రూవరీస్‌ సంస్థ ఈ మూడున్నరేళ్లలో 70,000 కోట్ల విలువైన మద్యాన్ని వివిధ డిస్టిలరీస్‌ నుంచి కొనుగోలు చేసింది. అందులో అదాన్‌ వాటా 1,100 కోట్లు. అంటే దాదాపు 1.55 శాతం. నిండా 2 కూడా లేదు. వీళ్లద్వారా ఇంత తక్కువ మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్న విషయాన్ని ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరెందుకు? మొత్తం మద్యాన్ని ఈ కంపెనీ నుంచే కొన్నట్టు పదేపదే ఈ పేరు తీస్తూ చెలరేగిపోతున్నారెందుకు? అబద్ధాలతో ఎన్నాళ్లని నమ్మించగలరు? మీకు అర్థసత్యాలు, అసత్యాలు తప్ప వాస్తవాలు అక్కర్లేదా? ఎన్నాళ్లిలా జనాన్ని మోసం చేస్తారు? ‘ఈనాడు’ అంటేనే వక్రీకరణ. ఎల్లో మీడియా అంటేనే అబద్ధాల పుట్ట. ఎన్ని సార్లు రాసినా... టీడీపీ ఆరోపణల్ని ఎంత మోసినా ఇవే కదా? ఇంత వయసు మీదపడ్డా... మీరు మారరా రామోజీ? 

► నిజం చెప్పాలంటే ఈ దుష్టచతుష్టయం ఒక డీపీటీ బ్యాచ్‌. అంటే దోచుకో–పంచుకో– తినుకో అనే సూత్రాన్ని అక్షరాలా తమ హయాంలో అమలు చేసి చూపించిన గజదొంగల ముఠా. గతంలో ఎవరి వాటా వారికి అందింది. కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌. ఒక్క వార్తా రాయలేదు. ఇప్పుడు ప్రశ్నించడానికి బయలుదేరిన దత్తపుత్రుడు నాడు ఒక్క ప్రశ్నా వేయలేదు. ఇప్పుడు అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వాళ్ల వాటాలు ఆగిపోయాయి. అందుకే ఈ గజదొంగల ముఠా కడుపు మండుతోంది. అందుకే గంటకో ఆరోపణ. పూటకో వేషం. రోజుకో నాటకం!. వీటన్నిటి గురించీ ఫిలిం సిటీ కొండమీద కట్టుకున్న కోటలో రామోజీరావు– చంద్రబాబు మంతనాలు. అవేమైనా రాజకోట రహస్యాలా? రాజకీయ వ్యభిచారపుటెత్తులే కదా?  

విశాఖలో కబ్జాలకు కేరాఫ్‌ రామోజీ, టీడీపీ 
అంతా మీకు నచ్చినట్లే... మీరు అనుకున్నట్లే జరగాలంటే ఎలా రామోజీరావు? మీరు మహా భూ కుంభకోణానికి స్కెచ్‌ వేసిన అమరావతి నాటకం కొనసాగనివ్వలేదని... విశాఖపై విషం కక్కుతారా? అసలు విశాఖలో కబ్జాలకు శ్రీకారం చుట్టిందెవరు? విశాఖ నగరానికి అక్షర ఫ్యాక్షనిజాన్ని నేర్పించింది రామోజీరావు కాదా? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో స్థల యజమానుల్ని న్యాయ స్థానాలకు ఈడ్చింది రామోజీరావు కాదా? తనది కాకపోయినా లీజు స్థలాన్ని ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా వచ్చిన స్థలాన్ని తన కొడుకు కిరణ్‌ పేరిట కాజేసిన చరిత్ర ఆయనది కాదా? దీనికోసం ఏకంగా దొంగ సంతకాలు పెట్టి, ఇతరుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసేసిన వ్యక్తి నీతులు చెప్పటం ఎంతవరకు సమంజసం? గీతం కాలేజీ పెట్టి ఏకంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంవీవీఎస్‌ మూర్తి తెలుగుదేశం నాయకుడు కాదా? దసపల్లా హిల్స్‌లో ఇరు పక్షాల మధ్య వివాదం ఉండగా... ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ముఖ్యమంత్రి హోదాలో కబ్జా చేసిందెవరు? అయ్యన్న పాత్రుడిదీ ఫోర్జరీ చరిత్రేగా? భూముల పరిహారం విషయంలో నకిలీ పట్టాలు సృష్టించి మరీ కాజేసిన ‘బండారు’ సత్యం బయటపడలేదా? ఇవన్నీ మీ ‘ఈనాడు’లో ఏనాడూ రాయరెందుకు రామోజీ? ఎందుకంటే వాళ్లు మీ భాగస్వాములనా? మరిప్పుడు  ప్రతిరోజూ విశాఖపై విద్వేషం చిమ్మటమెందుకు? అక్కడకు రాజధాని రాకూడదనా? విశాఖ నగరానికున్న వెయ్యేళ్ల ఘన చరిత్రను... భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆ నగరానికున్న ప్రాధాన్యాన్ని సాక్షాత్తూ ఈ దేశ ప్రధానే చెప్పారు.

అయినా మీ బుద్ధి మారదెందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఒకే ఒక్క అగ్రశ్రేణి నగరంపై మీకెందుకింత కక్ష? బౌన్సర్లను పెట్టుకుని మరీ విశాఖకు వ్యతిరేకంగా సాగించిన యాత్ర నకిలీదని న్యాయ స్థానాల సాక్షిగా తేలిపోయింది కదా!! అయినా సరే బుద్ధి లేకుండా ప్రతిరోజూ వైఎస్సార్‌ సీపీ నాయకులపై ఆరోపణలెందుకు? రోజూ పనిగట్టుకుని చెబితే అబద్ధాలు నిజాలైపోతాయా? మీరే తప్పుడు వార్తలు రాసి... మీరే నానా యాగీ చేస్తే ఎలా? పేదలకు ఇంగ్లిష్‌ మీడియం వద్దంటూ కోర్టులకెక్కి యాగీ చేసేదీ మీరే!!. పేదలకు ఇళ్లు రాకుండా న్యాయ స్థానాలకెళ్లి అడ్డుపడ్డదీ మీరే. ప్రతి స్థలాన్నీ వివాదాస్పదం చేసిందీ మీరే. కానీ ఒక్కటి మాత్రం నిజం!. మీ ముఠా వ్యూహాలను చిత్తు చేసే సంకల్ప బలం ఈ ప్రభుత్వానికి... ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఉంది. దానికి ప్రజాశీస్సులూ మెండుగా ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement