హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తాజాగా వెరిటాజ్ హెల్త్‌కేర్‌కి చెందిన దేశీ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ. 171 కోట్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. దేశీ మార్కెట్లో విస్తరించడానికి ఈ డీల్ తోడ్పడగలదని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో అరబిందోకి ఉన్న సామర్థ్యాలు, విస్తృతమైన వెరిటాజ్ నెట్‌వర్క్ తోడ్పాటుతో రాబోయే రోజుల్లో దేశీ ఫార్మా మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని ఆయన పేర్కొన్నారు.
దేశీయంగా బయోసిమిలర్లు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్రిటికల్ కేర్ చికిత్స విభాగంలో వెరిటాజ్‌కు 40 పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఫెపానిల్, మెరోగ్రామ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. 50,000 మంది పైచిలుకు రిటైలర్లు సంస్థ నెట్‌వర్క్‌లో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 127 కోట్ల టర్నోవరు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ. 133 కోట్ల టర్నోవరు నమోదు చేసింది.
సోమవారం అరబిందో షేరు బీఎస్‌ఈలో సుమారు ఒకటిన్నర శాతం క్షీణించి దాదాపు రూ. 707 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment