
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ హెల్త్‌కేర్ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈక్లర్క్స్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. అరబిందో అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..
ఈక్లర్క్స్ సర్వీసెస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఈక్లర్క్స్ సర్వీసెస్ నికర లాభం 30 శాతం ఎగసి రూ. 52 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం తక్కువగా రూ. 348 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 12 శాతం నీరసించి దాదాపు 45 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఈక్లర్క్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 104 జమ చేసుకుని రూ. 623 వద్ద ఫ్రీజయ్యింది.
అరబిందో ఫార్మా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అరబిందో ఫార్మా నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5925 కోట్లను తాకింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 1.25 డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం ఆదాయంలో యూఎస్ వాటా 16 శాతం ఎగసి రూ. 3107 కోట్లను అధిగమించినట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్-19 కాలంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించగలిగినట్లు తెలియజేసింది. అయితే ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం అరబిందో షేరు 3.2 శాతం క్షీణించి రూ. 904 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4.7 శాతం పతనమై రూ. 890 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చేరింది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment