
అరబిందో ఫార్మా లాభం రూ. 563 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 563 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 404 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 39 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 3,162 కోట్ల నుంచి రూ. 3,747 కోట్లకు ఎగిసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం రూ. 12,121 కోట్ల నుంచి రూ. 13,896 కోట్లకు ఎగియగా.. లాభం రూ. 1,576 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ. 1,982 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ షేరు ఒక్కింటిపై రూ.0.70 మేర మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
దీంతో పూర్తి సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరుపై రూ. 2.50 మేర డివిడెండ్ ప్రకటించినట్లవుతుందని ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. క్యూ4 ఆదాయాల్లో 80 శాతం భాగం ఫార్ములేషన్స్ విభాగం నుంచే వచ్చింది. అమెరికాలో మరిన్ని కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, యూరోపియన్ యూనియన్ మార్కెట్లో వ్యయాలను నియంత్రించుకోవడంపై దృష్టి సారిస్తామని గోవిందరాజన్ పేర్కొన్నారు. అమెరికాలో ఇంజెక్టబుల్స్ వ్యాపారం పటిష్టంగా ఉండటం, ఎబిలిఫై.. ఎన్టెకావిర్ వంటి ఔషధాలకు అనుమతులతో కంపెనీ లాభాలు సుమారు 36 శాతం వృద్ధి చెందగలవని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సోమవారం బీఎస్‌ఈలో సంస్థ షేరు 1.24 శాతం క్షీణించి రూ. 754.45 వద్ద ముగిసింది.