
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం దాదాపు 29 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు పెరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో అమ్మకాలు భారీగా పెరగడం ఇందుకు తోడ్పడింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 606 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 3,775 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు ఎగిసింది.
2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.50 మేర మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘అమెరికా, యూరప్‌తో పాటు ఇతర మార్కెట్లలో పటిష్టమైన వృద్ధి.. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుకు దోహదపడింది‘ అని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. గడ్డు పరిస్థితుల్లో కూడా తమ అమెరికా వ్యాపార విభాగం 21 శాతం మేర వృద్ధి నమోదు చేసిందని, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుత ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు.
స్పెషాలిటీ ఉత్పత్తుల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతుండటం భవిష్యత్‌లో కంపెనీ వృద్ధి బాటలో కొనసాగడానికి ఉపయోగపడగలదని గోవిందరాజన్ చెప్పారు. అనుబంధ సంస్థ రాయదుర్గం డెవలపర్స్‌లో అరబిందో రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ. 96 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో అందులో తమ వాటా 40 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment