హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది.
అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి.
పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment