ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం (కన్సాలిడేటెడ్) 5.7 శాతం పెరిగి రూ. 235 కోట్లుగా నమోదైంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం (కన్సాలిడేటెడ్) 5.7 శాతం పెరిగి రూ. 235 కోట్లుగా నమోదైంది. ఆదాయం 27.6 శాతం పెరిగి రూ. 1,913.9 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో ఆదాయం రూ. 1,500.4 కోట్లు కాగా లాభం రూ. 222.4 కోట్లు. జనరిక్ ఫార్ములేషన్స్ విభాగం తోడ్పాటుతో కంపెనీ మెరుగైన పనితీరు కనబర్చగలిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆంకాలజీ, హార్మోన్స్ తదితర అంశాల్లో కొత్త ఉత్పత్తుల రూపకల్పనతో వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వివరించారు. గురువారం కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.42% క్షీణించి రూ. 238.45 వద్ద, బీఎస్‌ఈలో 1.71% తగ్గి రూ. 238.35 వద్ద ముగిసింది.