N Govindarajan
-
అరబిందో లాభం డౌన్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది. నాట్రోల్ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది. బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్ ప్రైవేట్లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్–16తో కూడిన బిజినెస్‌ను స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థ వైటెల్స్ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. కీలక విభాగాలు భేష్ కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది. -
4.6% పెరిగిన అరబిందో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవర్ రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం.మా తొలి బయో సిమిలర్ ఉత్పాదనకు సంబంధించి వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతాం’’ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గోవిందరాజన్ చెప్పారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. -
అరబిందో ఫార్మా లాభం 6 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం (కన్సాలిడేటెడ్) 5.7 శాతం పెరిగి రూ. 235 కోట్లుగా నమోదైంది. ఆదాయం 27.6 శాతం పెరిగి రూ. 1,913.9 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో ఆదాయం రూ. 1,500.4 కోట్లు కాగా లాభం రూ. 222.4 కోట్లు. జనరిక్ ఫార్ములేషన్స్ విభాగం తోడ్పాటుతో కంపెనీ మెరుగైన పనితీరు కనబర్చగలిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆంకాలజీ, హార్మోన్స్ తదితర అంశాల్లో కొత్త ఉత్పత్తుల రూపకల్పనతో వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వివరించారు. గురువారం కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో 1.42% క్షీణించి రూ. 238.45 వద్ద, బీఎస్ఈలో 1.71% తగ్గి రూ. 238.35 వద్ద ముగిసింది.