తొలుత బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాలు పెరగడంతో కుదేలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమై 40,195కు చేరింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 11,780 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్‌ఎంఈజీ కంపెనీ పాలీక్యాబ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థ ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
పాలీక్యాబ్ ఇండియా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో పాలీక్యాబ్ ఇండియా నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 222 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 2,114 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 25 శాతం పెరిగి రూ. 288 కోట్లను తాకగా.. ఇబిటా మార్జిన్లు 2.72 శాతం బలపడి రూ. 14.76 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాలీక్యాబ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8.5 శాతం దూసుకెళ్లి రూ. 955 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 968 వరకూ ఎగసింది.
అరబిందో ఫార్మా
న్యూ మౌంటెయిన్ క్యాపిటల్, జారో ఫార్ములాస్‌తో బిజినెస్ యూనిట్ల విక్రయానికి యూఎస్ అనుబంధ సంస్థ నాట్రోల్ ఎల్‌ఎల్‌సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మా తాజాగా పేర్కొంది. పూర్తి నగదు రూపంలో 55 కోట్ల డాలర్ల(రూ. 4048 కోట్లు)కు డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2021 జనవరికల్లా డీల్ పూర్తికావచ్చని వివరించింది. నిధులను రుణభార తగ్గింపు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనున్నట్లు అరబిందో వెల్లడించింది. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1 శాతం లాభంతో రూ. 790 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 4 శాతం జంప్‌చేసి రూ. 815కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment