న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 44 శాతం క్షీణించి రూ. 694 కోట్లకు పరిమితమైంది.
డిమాండ్ మందగించడం, ముడివ్యయాల పెరుగుదల, డెకొరేటివ్, కోటింగ్ బిజినెస్ క్షీణించడం ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,232 కోట్లకుపైగా ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం అమ్మకాలు సైతం 5 శాతం నీరసించి రూ. 8,028 కోట్లకు చేరాయి. గత క్యూ2లో రూ. 8,479 కోట్ల టర్నోవర్ సాధించింది.
అయితే మొత్తం వ్యయాలు స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 7,093 కోట్లను దాటాయి. ఇతర వనరులతో కలిపి మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 8,201 కోట్లను తాకింది. కాగా.. అంతర్జాతీయ అమ్మకాలు నామమాత్ర క్షీణతతో రూ. 770 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో సాధించిన రూ. 40 కోట్ల పన్నుకుముందు లాభం(పీబీటీ)స్థానే రూ. 22 కోట్ల నష్టం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment