ఇన్వెస్టర్లకు లాభాల ఔషధం..! | 71% increased Pharma index in this year | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు లాభాల ఔషధం..!

Published Fri, Apr 3 2015 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

ఇన్వెస్టర్లకు లాభాల ఔషధం..!

ఇన్వెస్టర్లకు లాభాల ఔషధం..!

ఏడాదిలో 71% పెరిగిన ఫార్మా ఇండెక్స్
  ఇదే సమయంలో సెన్సెక్స్ పెరిగింది 25%
  లాభాలు కురిపించడంలో ముందున్న తెలుగు ఫార్మా కంపెనీలు
  ఏడేళ్లలో 60 రెట్లు పెరిగిన నాట్కో,
 అరబిందో ఫార్మా షేర్లు
  దేశంలో అత్యంత ధనవంతుడిగా
 మారిన సన్‌ఫార్మా అధినేత సంఘ్వీ

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడేళ్ల క్రితం అరబిందో లేదా నాట్కో ఫార్మా షేర్లలో రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ చేతికి ఎంత వస్తాయో తెలుసా.. అక్షరాలా ఆరు లక్షల పైమాటే... కేవలం ఎనిమిదేళ్ళలో మీ ఇన్వెస్ట్‌మెంట్ 60 రెట్లకు పైగా పెరిగినట్లే. ప్రస్తుత స్టాక్ మార్కెట్లో ఫార్మా రంగం ఎలా దూసుకుపోతోందో అని చెప్పడానికి ఈ రెండు షేర్లు ఒక చక్కటి ఉదాహరణ.దేశీయ స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఫార్మా షేర్లు నాయకత్వం వహిస్తున్నాయి. గత ఐటీ బూమ్ సమయంలో ఐటీ రంగ షేర్ల కదలికలను ఇప్పుడు ఫార్మా షేర్లు గుర్తు చేస్తున్నాయి.
 
 ఈ షేర్ల పెరుగుదలతో దేశీయ కుబేర్ల జాబితానే మారిపోతోంది. ఫోర్బ్స్ జాబితాలో దీర్ఘకాలంగా దేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీని తోసిరాజని సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ వచ్చి చేరారంటే షేర్ల విలువలు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. గత ఐటీ బూమ్ సమయంలో దేశీయ కుబేరుల జాబితాలో విప్రో ప్రేమ్‌జీతో పాటు అత్యధిక మంది ఐటీ కంపెనీ అధినేతలే ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫార్మా రంగం భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
 ఎందుకు పెరుగుతున్నాయి?..
 సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీలను రక్షణాత్మక (డిఫెన్సివ్) రంగాలుగా పేర్కొంటారు. మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు ఈ రంగానికి చెందిన షేర్లు పెరుగుతుంటాయి.. అదే స్టాక్ మార్కెట్ ర్యాలీ సమయంలో ఈ షేర్లు నష్టాలు అందించకపోయినా.. అంత పెద్దగా పెరగవు. కానీ ఈసారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఫార్మా షేర్లే ముందంజలో ఉండటం విశేషం. గడచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ కేవలం 25 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో ఫార్మా ఇండెక్స్ 71 శాతానికిపైగా లాభాలను అందించాయి.
 
 అంతే కాదు కొన్ని షేర్లు అయితే ఏకంగా రెండు నుంచి మూడు రెట్ల లాభాలను కూడా అందించాయి. వకార్డ్ ఫార్మా ఏడాది కాలంలో రూ. 457 నుంచి 308 శాతం పెరిగి రూ. 1,871కి చేరుకుంది. అలాగే ఈ ఏడాది కాలంలో సువెన్ లైఫ్ 303 శాతం, అజంతా ఫార్మా 206 శాతం, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ 200 శాతం, నాట్కో ఫార్మా 172 శాతం చొప్పున లాభాలు అందించాయి. దీనికి ప్రధాన కారణం దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం గణనీయంగా పెరుగుతుండటమే. గత కొంతకాలంగా ఇతర రంగాల ఆదాయాల్లో నెగటివ్ వృద్ధి లేక స్థిరంగా ఉంటే, ఫార్మా కంపెనీల ఆదాయాల్లో మాత్రం 20 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇదే సమయంలో ఫార్మా రంగానికి అప్పులు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోవడంతో ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
 కలిసొస్తున్న జెనరిక్ పేటెంట్లు
 రాష్ట్ర ఫార్మా కంపెనీల ఆదాయంలో సుమారు 50 శాతం జెనరిక్ ఔషధాల నుంచే సమకూరుతోంది. గత రెండేళ్ల నుంచి అమెరికాలో చాలా ఔషధాలకు పేటెంట్ హక్కులు అయిపోతుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ఫార్మా కంపెనీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. 2010-12లో అమెరికా మార్కెట్లో పేటెంట్లు అయిపోయిన ఔషధాల మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్లుగా ఉంటే, 2014-16లో ఈ విలువ రూ. 6 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్రానికి చెందిన డాక్టర్ రెడ్డీస్, నాట్కో, అరబిందో, సువెన్‌లైఫ్ వంటి కంపెనీలు ఈ పేటెంట్లను దక్కించుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి. నాట్కో ఫార్మా కొపాగ్జోన్, నెక్సావర్ వంటి కీలకమైన పేటెంట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement