
అరబిందో ఫార్మా లాభాల్లో క్షీణత
క్యూ3 ఫలితాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభాల్లో అరబిందో ఫార్మా స్వల్ప క్షీణతను నమోదు చేసింది. అంతకుముందు ఏడాది రూ. 417 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది 8 శాతం తగ్గి రూ. 384 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో ఆదాయం 48 శాతం పెరిగి రూ. 2,140 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది. ముడిపదార్థాల వినియోగం, సిబ్బంది జీతాల వ్యయం పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సమీక్షా కాలంలో ప్రధానమైన ఫార్ములేషన్స్ వ్యాపారం 76 శాతం పెరిగి రూ. 1,436 కోట్ల నుంచి రూ. 2,530 కోట్లకు చేరింది. అదే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్(ఏపీఐ) వ్యాపారంలో మాత్రం 9% క్షీణించింది. ఏపీఐ వ్యాపారంలో రూ. 744 కోట్ల నుంచి రూ. 674 కోట్లకు తగ్గింది.
ఆర్థిక ఫలితాలపై అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు లాభాల్లో నిలకడ స్థాయిని కొనసాగించగలిగామన్నారు. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరుపై 200% మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసింది.