
అరబిందో ఫార్మా లాభం రూ. 578 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 578 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం క్యూ3లో నమోదైన రూ. 544 కోట్లతో పోలిస్తే సుమారు 6 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు ఆదాయం రూ. 3,442 కోట్ల నుంచి రూ. 3,844 కోట్లకు పెరిగింది. నిర్దిష్ట ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. మెరుగైన పనితీరు కనపర్చగలిగామని గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ఎండీ ఎన్. గోవిందరాజన్ తెలిపారు.
స్పెషాలిటీ ఉత్పత్తులపై మరింతగా దృష్టి సారించనున్నట్లు ఆయన వివరించారు. సమీక్షాకాలంలో ఫార్ములేషన్స్ వ్యాపార విభాగం 11 శాతం వృద్ధితో మొత్తం ఆదాయాల్లో 80 శాతం వాటా ఆక్రమించింది. అమెరికా, ఇతర మార్కెట్లు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఫార్ములేషన్స్ ఆదాయాలు రూ. 1,558 కోట్ల నుంచి రూ. 1,745 కోట్లకు పెరిగాయి. అటు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) విభాగం ఆదాయం సుమారు 12 శాతం వృద్ధితో రూ. 695 కోట్ల నుంచి రూ. 776 కోట్లకు పెరిగింది. క్యూ3లో అమెరికా మార్కెట్లో 11 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.
బయోసిమిలర్స్ మార్కెట్లోకి..: టీఎల్ బయోఫార్మాస్యూటికల్స్ సంస్థకి చెందిన నాలుగు ఉత్పత్తుల కొనుగోలు ద్వారా బయోసిమిలర్స్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. నాలుగు మాలిక్యూల్స్‌కి సంబంధించిన డేటాను టీఎల్ అందిస్తుందని, తాము వాటిని అభివృద్ధి చేసి, అంతర్జాతీయంగా విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. బయోలాజిక్స్ తయారీ కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ప్లాంటు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని వివరించింది. సంక్లిష్టమైన ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగానే ఈ కొనుగోళ్లు జరిపినట్లు గోవిందరాజన్ వివరించారు.