సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో ‘108’అత్యవసర వైద్య సేవలను రాష్ట్రంలోని ప్రజలకు అందజేస్తామని అరబిందో ఫార్మా ఫౌండేషన్ వెల్లడించింది. తమకు ‘108’అత్యవసర వైద్య సేవలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. జీవీకే–ఈఎంఆర్‌ఐల కాలపరిమితి ముగిసినందున ఈ విన్నపం చేసింది. నామినేషన్ పద్ధతిలో తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ‘108’సేవలను నిర్వహించే సత్తా తమకుందని తెలిపింది. తమకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది. దాంతోపాటు ‘108’సేవలను ఏవిధంగా అత్యంత మెరుగ్గా అందజేస్తామన్న వివరాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనా నివేదికను వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది.
అమెరికాలో అత్యవసర వైద్య సేవలు అందించే ‘911’మాదిరిగానే తెలంగాణలోనూ నిర్వహిస్తామని, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేసింది. దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)లను కూడా మెరుగుపరుస్తామని తెలిపింది. ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేలా కృషిచేసి మాతాశిశు మరణాల రేటును తగ్గిస్తామని పేర్కొంది. ప్రాంతాల వారీగా జబ్బులను సూక్ష్మంగా పరిశీలించి సమగ్ర డేటా సేకరిస్తామని తెలిపింది. ప్రస్తుతమున్న అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచే నూతన మోడల్ ఏవిధంగా ఉంటుందో ఆ నివేదికలో తెలిపింది. ఇదిలావుండగా గతంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అరబిందోకు ‘108’ను ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖకు, నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘108’ను జీవీకే నుంచి అరబిందోకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్ రూపకల్పన..
ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, అత్యంత సమర్థవంతంగా, నాణ్యమైన సేవలు అందిస్తా మని అరబిందో ముఖ్యమంత్రికి పంపిన లేఖలో నూ, వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. వాటిల్లో ఇంకా ఏముందంటే.. ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉప యోగించుకుంటూ, వాటిల్లో అనేక మార్పులు చేర్పులూ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్‌గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోని ఇంటర్‌ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు.
ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను రూపొందిస్తారు. ఇది ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచన. అంతేకాదు ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన శిక్షణ కలిగిన సిబ్బందిని నియమిస్తారు. మెడికల్, పోలీస్, ఫైర్ ఎమర్జెన్సీలకు సంబంధించి కీలకమైన ఏరియాలు, సంఘటనలు పరిశోధించి సమగ్ర డేటా సేకరిస్తారు. అత్యవసర సంఘటనలకు సంబంధించిన అంశాలను విశ్లేషిస్తారు. ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు.
పారదర్శకంగా సేవలు...
అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ‘108’అత్యవసర సేవలను అందిస్తామని అరబిందో హామీ ఇచ్చింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితుడిని చేరుకుంటామని తెలిపింది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆస్పత్రికి ముందస్తు సమాచారం ఇస్తామని వివరించింది. భవిష్యత్‌లో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేస్తారని ఆ నివేదికలో అరబిందో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment