మన డాక్టరమ్మకు భద్రత కావాలి | Female doctors needs security | Sakshi
Sakshi News home page

మన డాక్టరమ్మకు భద్రత కావాలి

Published Thu, Aug 22 2024 5:36 AM | Last Updated on Thu, Aug 22 2024 5:36 AM

Female doctors needs security

ప్రభుత్వాస్పత్రులు, కళాశాలల్లో పటిష్ట నిఘా ఉండాలి

సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేసే వీలుండాలి

ఫిర్యాదుల కమిటీల్లో పోలీస్, న్యాయశాఖకు చోటివ్వాలి

రోగి సహాయకులను నియంత్రించాలి 

మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినుల భద్రతపై ‘సాక్షి’తో నిపుణులు

సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతా­వరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్‌ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.

గళం విప్పే వ్యవస్థ రావాలి
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. 

కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్‌ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. 

హౌస్‌ సర్జన్‌లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్‌ తప్పకుండా ఇవ్వాలి.

సహాయకుల రాకపోకలపై షరతులు
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్‌ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు.  

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్‌ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. 

గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్‌ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.

భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు
రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. 

⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్‌ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.

⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్‌ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. 

⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్‌ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో  పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. 

⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.

⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.

కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలి
వైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్‌ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్‌ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్‌ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి.   
– డాక్టర్‌ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్‌ 

సీసీ కెమెరాలు పెంచాలి
విశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్‌లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్‌ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. 
– డాక్టర్‌ వెంగమ్మ, రిటైర్డ్‌ డైరెక్టర్, వీసీ, స్విమ్స్‌ యూనివర్సిటీ, తిరుపతి

వసతులు మెరుగుపడాలి
ఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్‌ రూమ్స్, రెస్ట్‌ రూమ్స్, డ్యూటీ రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి.  
– డాక్టర్‌ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ  

వ్యవస్థ  మారాలి..
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి వద్ద జూనియర్‌ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి  

రాత్రి భద్రత పెంచాలి
బోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్‌ఫెక్షన్‌ వైద్య సేవలు, బ్లడ్‌ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్‌ డ్యూటీలు చేస్తుంటారు. 

అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. 
– డాక్టర్‌ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement