ఉచిత విద్యా, వైద్యం పేదలకు దూరం చేయడమే చంద్రబాబు లక్ష్యం
గతంలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చొరవ చూపలేదు
కేంద్రంలో భాగస్వామైనా గతంలోనూ చేతులెత్తేసిన చంద్రబాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ కళాశాలలే ప్రైవేట్ పరం చేసే కుట్ర
చంద్రబాబు తీరుపై మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
‘‘ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుంది. దాని నిర్వహణ కోసం ఏటా రూ. 30 కోట్లు కావాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలలఏర్పాటుకు అనుమతులిస్తాం.’’
– వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా అసెంబ్లీలో నాటి వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు
‘‘పులివెందుల కళాశాలకు అనుమతులు రావడం విస్మయం కలిగించింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. అయినా అనుమతులు వచ్చాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ పరిధిలో కొనసాగించడానికి నిధుల్లేవు. అందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహించాలని నిర్ణయించాం. – ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు
అవకాశాలను కాలరాసిన బాబు
వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014–19 మధ్య విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపలేదు. 2019కు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలని రాబట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి అసెంబ్లీ సాక్షిగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.
విభజన చట్టం కింద కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. గతంలో ప్రైవేట్‌లో వైద్య కళాశాలలను ప్రోత్సహించిన బాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైద్య విద్య అవకాశాలను కాలరాశారని నీట్ యూజీ ర్యాంకర్‌లు ధ్వజమెత్తుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించేలా గత ప్రభుత్వంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. ఆ కళాశాలలకు అడ్డుపడి ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ కుటుంబం చెరగని ముద్ర
ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ వంటి వ్యవస్థలను ప్రారంభించి వైద్య రంగంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలోనే కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న తండ్రి ఆశయాన్ని వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారు.
ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ, 104, 108 వ్యవస్థలతో పాటు, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర
వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉండగా కుట్రపూరితంగా బాబు ప్రభుత్వం అడ్డుపడింది.
Comments
Please login to add a commentAdd a comment