జనాభా ప్రాతిపదికన వైద్య కళాశాలలు | State Government Requested Central Medical and Health Department For Government Health Colleges In AP | Sakshi
Sakshi News home page

జనాభా ప్రాతిపదికన వైద్య కళాశాలలు

Dec 15 2019 5:02 AM | Updated on Dec 15 2019 5:02 AM

State Government Requested Central Medical and Health Department For Government Health Colleges In AP - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను జిల్లాల వారీగా కాకుండా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు  పంపించారు. భారతీయ వైద్య మండలి, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం ఏ జిల్లాలో అయినా ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ప్రైవేటు వైద్య కళాశాల లేకపోతే ఆ జిల్లాకు కేటాయించాలని ఉంది. ఈ లెక్కన ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోయినా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అక్కడ ఏర్పాటుకు వీల్లేదు. కానీ, ఇలా జిల్లాల ప్రాదిపదికన కాకుం డా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కేంద్రాన్ని కోరింది.

వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు 
ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయదలిచామని.. వీటిని పాడేరు వంటి గిరిజన ప్రాంతంలోనే కాకుండా.. గురజాల, మార్కాపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో (మచిలీపట్నం, పులివెందుల, ఏలూరు, విజయనగరం, గురజాల, మార్కాపురం, పాడేరు) పెట్టాలని సంకల్పించినట్లు వివరించారు.

ఇందుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇవి సాకారమైతే వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని.. వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఏడు కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేశారని, వీటి పరిధిలో జనాభాతో పోలిస్తే, ఏపీలో కొత్తగా తలపెట్టిన వైద్య కళాశాలల పరిధిలో జనాభా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అందుకే జిల్లాల వారీగా కాకుండా జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరారు. ఈనెల 16న మళ్లీ వైద్య విద్యాశాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి లేఖ ఇవ్వనున్నారు.

ఐదేళ్లలో ఒక్క కళాశాల కూడా ఏర్పాటు కాలేదు 
2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు కాలేదు. 2014 ఎన్నికల సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య కళాశాలలు లేని జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని మొక్కుబడిగా జీఓలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రతిపాదనలు పంపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement