requested
-
ప్రభుత్వ విధాన నిర్ణయంపై పిల్ దాఖలు చేయొచ్చా?
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ భవనాలు నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని, పిల్ పేరుతో ప్రాథమిక దశలోని ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీల్లేదని, అలాంటి పిల్‌పై న్యాయస్థానం స్పందించవచ్చునో, లేదో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) పేరుతో ఎవరో వచ్చి ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని, అందుకే ఈ విషయంలో న్యాయపరమైన మీమాంసను ధర్మాసనం నివృత్తి చేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. మంగళవారం హైకోర్టు ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోడానికి వీల్లేదని, సచివాలయ భవనాల నిర్మాణ అంశం ప్రాథమిక విధాన నిర్ణయ దశలో ఉందని, దీనిపై న్యాయపరంగా సవాల్ చేయడానికి అవకాశం ఉందో లేదో తేల్చాలని కోరారు. ఆ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాల్ చేసేందుకు అవకాశముందా, అలా చేస్తే చెల్లుబాటవుతుందా, ఇలాంటి దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై కూడా తమకున్న న్యాయ మీమాంసపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సచివాలయ భవనాలను కూల్చరాదంటూ దాఖలైన పిల్స్ కంటే ముందుగా తాము లేవనెత్తిన ఈ అంశంపై తుది విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇప్పటికే సచివాలయం మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసి వేరే భవనాలకు మార్పు చేశామని తెలిపారు. కాగా, సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల్లో హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నిర్మాణం చేయబోయే భవనాలకు బడ్జెట్ ఎంత కావాలి, డిజైన్, ప్లాన్లు వంటివి ఖరారు చేసి వాటిని మంత్రివర్గం ఆమోదించే వరకూ ఇప్పుడున్న సచివాలయ భవనాన్ని కూల్చరాదని హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్ పేరుతో ఎవరో వచ్చి హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చో లేదో తేల్చాలని ఏజీ చేసిన వినతిపై మార్చి 3న తుది విచారణ జరుపుతామని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
జనాభా ప్రాతిపదికన వైద్య కళాశాలలు
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను జిల్లాల వారీగా కాకుండా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపించారు. భారతీయ వైద్య మండలి, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం ఏ జిల్లాలో అయినా ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ప్రైవేటు వైద్య కళాశాల లేకపోతే ఆ జిల్లాకు కేటాయించాలని ఉంది. ఈ లెక్కన ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోయినా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అక్కడ ఏర్పాటుకు వీల్లేదు. కానీ, ఇలా జిల్లాల ప్రాదిపదికన కాకుం డా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయదలిచామని.. వీటిని పాడేరు వంటి గిరిజన ప్రాంతంలోనే కాకుండా.. గురజాల, మార్కాపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో (మచిలీపట్నం, పులివెందుల, ఏలూరు, విజయనగరం, గురజాల, మార్కాపురం, పాడేరు) పెట్టాలని సంకల్పించినట్లు వివరించారు. ఇందుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇవి సాకారమైతే వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని.. వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఏడు కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేశారని, వీటి పరిధిలో జనాభాతో పోలిస్తే, ఏపీలో కొత్తగా తలపెట్టిన వైద్య కళాశాలల పరిధిలో జనాభా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అందుకే జిల్లాల వారీగా కాకుండా జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరారు. ఈనెల 16న మళ్లీ వైద్య విద్యాశాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి లేఖ ఇవ్వనున్నారు. ఐదేళ్లలో ఒక్క కళాశాల కూడా ఏర్పాటు కాలేదు 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు కాలేదు. 2014 ఎన్నికల సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య కళాశాలలు లేని జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని మొక్కుబడిగా జీఓలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ ప్రతిపాదనలు పంపించింది. -
ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇవ్వండి
హన్మకొండ చౌరస్తా: ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఓ అధ్యాపకురాలు పోలీసులకు అర్జీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా నంటూ.. తన పేరు నౌషీన్ ఫాతిమాగా కమిషనర్‌కు ఇచ్చిన అర్జీలో ఆమె పేర్కొంది. కేవలం ఈ–మెయిల్ ఐడీని మాత్రమే పేర్కొన్న నౌషీన్ ఫాతిమా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఉద్యోగరీత్యా నిత్యం ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణిస్తానని, తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది. ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తన ఇల్లు ఉందని, నిత్యం అదే మార్గంలో వెళ్తానంటూ తెలిపింది. ప్రియాంకారెడ్డి, మానసపై జరిగిన అఘాయిత్యాలు ఇతర మహిళలపైనా జరగొచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహాయం కోరినా పోలీసులు రక్షిస్తారన్న నమ్మకం లేదని దరఖాస్తులో పేర్కొంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండటమే సురక్షిత మార్గమని నమ్ముతున్నట్లు వివరించింది. ‘అతడిని శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు’ సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యల నిందితుడిని కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంకారెడ్డి, మానస హత్యలు జరిగేవి కావని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలు, బాలికల హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇకనైనా మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ పురపాలిక పరిధిలోని ఎదిర శివారులో 500 ఎకరాలలో ఐటీ టవర్, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న మంత్రికి, తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ వారితో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం క్రియాశీల విధాన చర్యలు చేపట్టిందని, ఇందుకోసం పలు నిర్ధిష్టమైన విధానాలు తెచ్చిందని వివరించారు. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు. భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్‌లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు. -
ప్లీజ్.. నాకు పెళ్లి వద్దు
బషీరాబాద్: ‘‘సార్.. నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇంకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. మా అమ్మానాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఆదివారం నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంచి, చెడు ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది. పైగా నేను మేజర్‌ను. దయచేసి ఈ పెళ్లిని ఆపండి సార్.. లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి’’అంటూ శనివారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై తాండూరు గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ ఆమె తల్లిదండ్రులను ఠాణాకు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి మేజర్ కావడంతో ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని వారికి సూచించారు. ‘మంచి సంబంధమని ఇప్పటికే పెళ్లికి అంగీకరించాం. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నాక ఇష్టం లేదంటే బంధువుల ఎదుట మా పరువు ఏం కావాలి’అంటూ తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. తాము ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటామని తల్లిదండ్రులు యువతిని తీసుకొని ఇంటికి వెళ్లారు. యువతి మేజర్ కావడంతో ఇష్టం లేని పెళ్లి చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, వరుడి వయస్సు 40 ఏళ్లని తెలుస్తోంది. -
వాటర్‌గ్రిడ్‌కు కేంద్ర సహకారం కోరాం
ఢిల్లీలో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లా నీళ్ల (వాటర్‌గ్రిడ్) పథకానికి, రెండు పడకల ఇళ్ల పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. హడ్కో 45వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అభినందిస్తూ మౌలిక వసతుల విభాగంలో రాష్ట్రానికి వచ్చిన అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేతులమీదుగా కేటీఆర్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేపాల్ భూకంపంలో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవరసమైతే ప్రత్యేకంగా అధికారుల బృందాలను పంపి వారిని క్షేమంగా తీసుకువస్తామని స్పష్టం చేశారు.