సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ భవనాలు నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని, పిల్ పేరుతో ప్రాథమిక దశలోని ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీల్లేదని, అలాంటి పిల్‌పై న్యాయస్థానం స్పందించవచ్చునో, లేదో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) పేరుతో ఎవరో వచ్చి ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని, అందుకే ఈ విషయంలో న్యాయపరమైన మీమాంసను ధర్మాసనం నివృత్తి చేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. మంగళవారం హైకోర్టు ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోడానికి వీల్లేదని, సచివాలయ భవనాల నిర్మాణ అంశం ప్రాథమిక విధాన నిర్ణయ దశలో ఉందని, దీనిపై న్యాయపరంగా సవాల్ చేయడానికి అవకాశం ఉందో లేదో తేల్చాలని కోరారు.
ఆ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాల్ చేసేందుకు అవకాశముందా, అలా చేస్తే చెల్లుబాటవుతుందా, ఇలాంటి దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై కూడా తమకున్న న్యాయ మీమాంసపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సచివాలయ భవనాలను కూల్చరాదంటూ దాఖలైన పిల్స్ కంటే ముందుగా తాము లేవనెత్తిన ఈ అంశంపై తుది విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇప్పటికే సచివాలయం మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసి వేరే భవనాలకు మార్పు చేశామని తెలిపారు. కాగా, సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల్లో హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నిర్మాణం చేయబోయే భవనాలకు బడ్జెట్ ఎంత కావాలి, డిజైన్, ప్లాన్లు వంటివి ఖరారు చేసి వాటిని మంత్రివర్గం ఆమోదించే వరకూ ఇప్పుడున్న సచివాలయ భవనాన్ని కూల్చరాదని హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్ పేరుతో ఎవరో వచ్చి హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చో లేదో తేల్చాలని ఏజీ చేసిన వినతిపై మార్చి 3న తుది విచారణ జరుపుతామని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment