female doctors
-
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
కరోనా: మహిళా డాక్టర్లపై దాడి.. ఒకరి అరెస్ట్
ఢిల్లీ : ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడికి పాల్పడిన 44 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు బుధవారం రాత్రి గౌతం నగర్లో పండ్లు కొనడానికి వెళ్లారు. అయితే వారి వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని ఇంటి పక్కనే ఉండే 44 ఏళ్ల వ్యక్తి వాదనకు దిగాడు. మహిళా డాక్టర్లు ఎంత వారించినా వినకుండా అసభ్య పదజాలంతో తిడుతూ దాడికి పాల్పడ్డాడు. 'మేమిద్దరం పండ్లు కొనడానికి వచ్చినప్పుడు దూరంగా ఉండండి అంటూ గట్టిగా అరిచాడు. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నామని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డాడు' అని మహిళా డాక్టర్లు తెలిపారు. ఇద్దరు మహిళా డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసుకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
ఆత్మీయషికిత్స..!
వీరు కొందరు మాత్రమే. పదుల సంఖ్యలో ఉన్న మేలిరకపు మణిపూసలకు వీరు ప్రతినిధులు. మందులతో పాటు మాటలతోనూ బాధను మాన్పుతున్న మహిళా వైద్యుల నై‘పుణ్యానికి’ చిహ్నాలు వీరు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైద్యులు పెరిగారు. వైద్య విధానాలు పెరిగాయి. అందుబాటులో ఉన్న మందుల సంఖ్య కూడా బాగా పెరిగింది. కానీ వైద్యులు, బాధితులకు మధ్య ఉండాల్సిన ఆత్మీయ కోణం మాత్రం రానురాను తగ్గుతోంది. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తున్నారు కొందరు అతివలు. వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా సేవలా భావిస్తూ, వృత్తిని దైవంగా పూజిస్తూ ‘షి’కిత్స చేస్తున్నారు. మరి ప్రాణం పోయగలిగే శక్తి ఉన్న స్త్రీలకు ప్రాణాలు కాపాడడం పెద్ద పని కాదు కదా. సేవ చేస్తా.. సమాజంలో పేదలకు సేవ చేయాలని చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆలోచనతోనే ఎంబీబీఎస్ పూర్తి చేశా ను. ఇప్పుడు చాపర పీహెచ్సీ వైద్యాధికారిగా పోస్టింగ్ లభించింది. ఇప్పుడు ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించే అవకాశం కలిగింది. వైద్య సేవలు అందించడంతో పా టు ఆరోగ్య పరమైన విజ్ఞానాన్ని అంది స్తున్నా. పీహెచ్‌సీకి వివిధ వ్యాధులతో పాటు గైనిక్ సమస్యలతో పేద మహిళలు వస్తున్నా రు. వారికి నా వంతు సాయపడుతున్నాను. –దువ్వాడ దివ్య, చాపర పీహెచ్సీ వైద్యురాలు తాత కోరిక నేను డాక్టర్ కా వాలనేది మా తాతయ్య ఆశ యం. ఈ వృత్తి అంటే నాకెం తో ఇష్టం. గ్రా మీణ ప్రజలకు సేవలు చేయాలనే ఆశయంతోనే సంతకవిటి పీహెచ్సీలో చేరాను. లక్ష్యం, పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించవచ్చు. అందుకు కు టుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా కావాలి. –గట్టి భార్గవి, సంతకవిటి పీహెచ్సీ వైద్యాధికారి కాబోయే అమ్మకు ఆసరాగా.. ఇచ్ఛాపురం: డాక్టర్ పిరియా ప్రతిభాప్రియ.. ఇచ్ఛాపురం చుట్టపక్కల ప్ర సూతి కేసులకు కేరాఫ్. వైద్యుల పేర్లు జనం గుర్తు పెట్టుకోవడమే ఆ డాక్టర్‌కు పెద్ద ఘనత. అలాంటిది ప్రతిభాప్రియ వైద్యురాలిగానే కాకుండా ఓ ఆత్మీయురాలిగా స్థానికులకు సేవలందిస్తూ అందని హృదయాల్లో చోటు సంపాదించారు. ఇచ్ఛాపురం పట్టణంలోని మంగళవారంపేటలో నివాసమంటున్న ప్రతిభాప్రియ నామమాత్రమైన ఫీజుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈమె కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేసి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో 2003లో గైనకాలజీలో స్పెషలైజేషన్ చేశారు. సోంపేట, ఇచ్ఛాపురం, హరిపురం, ఎంఎస్‌పల్లి, కవిటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించి ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ముఖ్యంగా ప్రసూతి కేసులను సున్నితంగా, సమర్థంగా పరిష్కరించి మంచి పేరు సంపాదించారు. స్థానిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని, పౌష్టికాహారం సమృద్ధిగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆమె సూచిస్తున్నారు. 15 మందిలో ఒకరు.. సోంపేట: ప్లాస్టిక్ సర్జరీ.. సినిమాల్లో తప్ప సిక్కోలు వాసులు స్థానికంగా ఈ పేరు వినే అవకాశం చాలా తక్కువ. అలాంటిది మన ఆడ పడు చు ప్లాస్టిక్ సర్జరీ నిపుణురాలిగా రాణిస్తుండడం మనకు గర్వకారణమే కదా. బారువ గ్రామానికి చెందిన బస్వా మణికుమారి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన క్యాన్సర్ ప్రభుత్వ వైద్యశాలలో (హైదరాబాద్) ప్లాస్టిక్ సర్జ రీ నిపుణులుగా రాణిస్తున్నారు. మణికుమారి బారువ గ్రామంలోని ప్ర భుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంటర్ ను శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల, ఎంబీబీఎస్‌ను విశాఖ పట్టణంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో చదివారు. ఉన్నత స్థానంలో ఉండడమే కాదు అంతే ఉన్నతంగా ఆలోచిస్తూ ఏటా వేలాది మందికి గ్రహణం మొర్రి, క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ సర్జరీ స్త్రీ వైద్య నిపుణులు కేవలం 15 మంది వరకే ఉంటారు. అందులో మణికుమారి ఒకరు. ఈ ప్రాంతం నుంచి వెళ్లే రోగుల అవసరాలు తీర్చడంలోనూ ఆమె ముందుంటారు. మార్గదర్శకురాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: అవ్వారు కృష్ణవేణి.. అచ్చమైన తెలుగు పేరు. నిబద్ధతకు మారుపేరు. రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్పత్రి ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. తనదైన ముద్రను ఆమె స్పష్టం చేయడంతో ఒక్కొక్కటిగా మార్పులు మొదలవుతున్నాయి. ఆమె పుట్టి పెరిగినదంతా వైజాగ్‌లోనే అయినా ఉద్యోగ రీత్యా ఇప్పుడు సిక్కోలుతో మంచి సంబంధం ఏర్పరచుకున్నారు. ఆమె సాధించిన ఘనతల్లో కొన్ని పరిశీలిస్తే.. వైద్యాధికారిగా తొలి పోస్టింగ్ విశాఖ జిల్లాలోని అనకాపల్లి దగ్గర హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చింది. ఆమె చేరిన కొత్తల్లోనే ఆ గ్రామంలో కలుషిత నీటి వల్ల ప్రజలం దరికీ డయేరియా వచ్చేసింది. ఆ సమయంలో బాలింతరాలైనప్పటికీ, ఆ గ్రామంలోనే ఉండిపో యి, టీమ్ వర్క్‌తో ప్రజలందరికీ వైద్యం అంది ంచారు. ఇది ఆమె కెరీర్లో ఇదే తొలి విజయం. ఏడేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన ఆమె ఆ తర్వాత సేవామార్గం వైపు మళ్లారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ఆమె చేసిన వైద్య పరి శోధనకు 2000 సంవత్సరంలో ప్యారేలాల్ శర్మ మెమోరియల్ ప్రైజ్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఈమె. రిమ్స్‌లో డిపార్ట్మెంట్ అభివృద్ధి కృష్ణవేణి ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసీ)లో పనిచేస్తూ, బదిలీపై 2014లో శ్రీకాకుళం రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్‌గా వచ్చారు. తర్వాత డీన్, 2017 జూలైలో డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్ కాకముందే తన విభాగాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016 ఆగస్టులో 1981 ఆంధ్రా మెడికల్ కళాశాల ఎంబీ బీఎస్ బ్యాచ్ స్నేహితుల (ప్రస్తుతం అమెరికాలో ఒకరు, కాకినాడలో ఒకరు, పలాసలో ఒకరు ఉన్నారు మిగిలిన వారు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు.) విరాళాలు కలిపి సుమారు నాలుగున్నర లక్షల రూపాయలతో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఆరు ఏసీలు, ఇన్నోవేషన్, సౌకర్యాలు కల్పించారు. గ్రంథాలయం తాగునీటి కోసం ఫ్యూరిఫైర్ మెషీన్, సెమినార్ హాల్లో ఎల్సీడీ, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని తరగతి గదులకు ఎల్సీడీ ప్రొజెక్టర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేశారు. ఠిడైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాక మరింత శ్రద్ధ పెట్టారు. స్టాఫ్ రూమ్‌లో ఏసీలు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ఠిమెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌ను ప్రారంభించి, వైద్యులకు బేసిక్ ట్రైనింగ్ నాలుగు రో జుల పాటు రిమ్స్‌లో అందజేశారు. ఇలాంటి శిక్షణ ఏపీలోనే తొలిసారి కావడం విశేషం. -
మహిళా డాక్టర్లకూ తప్పని లైంగిక వేధింపులు
వాషింగ్టన్: సమాజంలో మిగతా ప్రొఫెషన్లతో పోల్చితే.. డాక్టర్ ప్రొఫెషన్‌కు ఉన్న గౌరవమే వేరు. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో మాత్రం వైద్యరంగం మిగతా రంగాలకు మినహాయింపేమీ కాదని చెబుతున్నాయి తాజా సర్వేలు. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జేఏఎమ్ఏ) ప్రచురించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా వైద్యరంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డాక్టర్లపై జరిపిన పరిశీలనలో 30 శాతం మంది మహిళలు తాము ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. సుమారు వెయ్యి మందికి పైగా హై ప్రొఫైల్ మహిళా డాక్లర్లపై యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన సర్వే వివరాలను జేఏఎమ్ఏలో ప్రచురించారు. అయితే ఈ సర్వేలో పాల్గొన్న డాక్టర్లంతా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేత ప్రతిష్టాత్మక కెరీర్ డెవలప్మెంట్ అవార్డ్స్ అందుకున్న సీనియర్ డాక్టర్లు కావడం విశేషం. ఈ సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది మహిళా డాక్టర్లు తాము లింగ వివక్షతను ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ వివరాలు సమాజంలో ఇంకా సాధించాల్సిన జెండర్ ఈక్వాలిటీని గుర్తుచేస్తున్నాయని మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రేష్మా జగ్సీ తెలిపారు. గత నెలలో వెల్లడించిన సర్వే వివరాల్లో సైతం.. పురుష డాక్టర్ల కంటే మహిళా డాక్టర్ల వేతనం 24 శాతం తక్కువగా ఉంటోందని వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. -
మహిళా వైద్యులూ బాధితులే
వాషింగ్టన్: అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళా డాక్టర్లలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. భారతదేశానికి చెందిన ఫిజీషియన్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ స్కూల్ కు చెందిన రేష్మా జాగ్సి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ లో 2006 నుంచి 2009 మధ్య కెరీర్ డెవలప్ మెంట్ అవార్డు తీసుకున్న 1066 మంది వైద్యుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వైద్యుల సగటు వయస్సు 43 ఏళ్లు. వైద్యులకు ఆమె అనేక ప్రశ్నలు వేశారు. లింగ వివక్షను ఎదుర్కొన్నారా అని ప్రశ్నించినపుడు 70 శాతం మంది మహిళల్లో 22 శాతం మంది లింగ వివక్షను ఎదుర్కొన్నామని, 30 శాతం మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. హుందాగల ఉద్యోగంలో ఉన్న మహిళలకూ వేధింపులు తప్పడం లేదని జాగ్సి తెలిపారు. వైద్య విద్యార్థుల సిలబస్ లో లింగ సమానత్వం గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు సామాజిక సమస్యగా మారాయని జాగ్సి అన్నారు. పరిశోధన వివరాలను అమెరికాలోని జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించింది. -
వేధిస్తున్న మహిళా వైద్యుల కొరత
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రి పేదలకు దూరమవుతోంది. కాన్పుల కోసం ఇక్కడ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ తగిన డాక్టర్లు లేకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రతి కేసును కడప రిమ్స్‌కు పంపిస్తున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి వుంది. స్థానిక ప్రజలతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం,దువ్వూరు, మైదుకూరు, కమలాపురం మండలాలకు చెందిన వారు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఇక్కడ ఐదు మంది మహిళా వైద్యులు ఉండేవారు. పగలు ఓపితో పాటు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండేవారు. అంతేగాక కాన్పుల వార్డులో ప్రతి రోజూ ఒక డాక్టర్ విధులు నిర్వహించేవారు. గర్భిణీలతో పాటు బాలింతలకు మెరుగైన వైద్యం లభించేది. అయితే ముగ్గురు సెలవులో ఉండగా ఒక డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో భాగ్యమ్మ అనే డాక్టర్ మాత్రమే నాలుగైదు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఒకరే డాక్టర్ కావడంతో పగలు ఓపీతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆస్పత్రికి వచ్చే కాన్పుల కేసులను చూడటానికి డాక్టర్ లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సులే దిక్కు.. ఆస్పత్రిలోని కాన్పుల విభాగంలో రాత్రి సమయాల్లో డాక్టర్లు లేకపోవడంతో నర్సులే దిక్కవుతున్నారు. మొదటి సారి సాధారణ ప్రసవం జరిగి తిరిగి రెండో కాన్పు కోసం వచ్చిన మహిళలను మాత్రం ఇక్కడి నర్సులు చేర్పించుకుంటున్నారు. మొదటి కాన్పు కోసం వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తతో కడప రిమ్స్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. డాక్టర్ లేరని చెప్పకుండా బీపీ ఎక్కువగా ఉందనో, బిడ్డ ఉమ్మునీరు తాగిందని చెప్పుతుండటంతో ఆందోళన చెంది వేరే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల కొరత ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ఒకరిద్దరైనా వస్తారనే ఆశాభావం ఉంది. అప్పటి వరకు ఉన్న డాక్టర్తోనే సర్దుకుని పోవాల్సిందే. - ఎస్.ఎన్.మూర్తి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్