ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రి పేదలకు దూరమవుతోంది. కాన్పుల కోసం ఇక్కడ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ తగిన డాక్టర్లు లేకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రతి కేసును కడప రిమ్స్‌కు పంపిస్తున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి వుంది. స్థానిక ప్రజలతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం,దువ్వూరు, మైదుకూరు, కమలాపురం మండలాలకు చెందిన వారు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఇక్కడ ఐదు మంది మహిళా వైద్యులు ఉండేవారు. పగలు ఓపితో పాటు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండేవారు.
అంతేగాక కాన్పుల వార్డులో ప్రతి రోజూ ఒక డాక్టర్ విధులు నిర్వహించేవారు. గర్భిణీలతో పాటు బాలింతలకు మెరుగైన వైద్యం లభించేది. అయితే ముగ్గురు సెలవులో ఉండగా ఒక డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో భాగ్యమ్మ అనే డాక్టర్ మాత్రమే నాలుగైదు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఒకరే డాక్టర్ కావడంతో పగలు ఓపీతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆస్పత్రికి వచ్చే కాన్పుల కేసులను చూడటానికి డాక్టర్ లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నర్సులే దిక్కు..
ఆస్పత్రిలోని కాన్పుల విభాగంలో రాత్రి సమయాల్లో డాక్టర్లు లేకపోవడంతో నర్సులే దిక్కవుతున్నారు. మొదటి సారి సాధారణ ప్రసవం జరిగి తిరిగి రెండో కాన్పు కోసం వచ్చిన మహిళలను మాత్రం ఇక్కడి నర్సులు చేర్పించుకుంటున్నారు. మొదటి కాన్పు కోసం వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తతో కడప రిమ్స్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. డాక్టర్ లేరని చెప్పకుండా బీపీ ఎక్కువగా ఉందనో, బిడ్డ ఉమ్మునీరు తాగిందని చెప్పుతుండటంతో ఆందోళన చెంది వేరే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల కొరత ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ఒకరిద్దరైనా వస్తారనే ఆశాభావం ఉంది. అప్పటి వరకు ఉన్న డాక్టర్‌తోనే సర్దుకుని పోవాల్సిందే.
- ఎస్.ఎన్.మూర్తి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
వేధిస్తున్న మహిళా వైద్యుల కొరత
Published Tue, Dec 3 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement