మహిళా వైద్యులూ బాధితులే
Published Wed, May 18 2016 6:49 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
వాషింగ్టన్: అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళా డాక్టర్లలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. భారతదేశానికి చెందిన ఫిజీషియన్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ స్కూల్ కు చెందిన రేష్మా జాగ్సి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ లో 2006 నుంచి 2009 మధ్య కెరీర్ డెవలప్ మెంట్ అవార్డు తీసుకున్న 1066 మంది వైద్యుల అభిప్రాయాలను తీసుకున్నారు.
ఈ సర్వేలో పాల్గొన్న వైద్యుల సగటు వయస్సు 43 ఏళ్లు. వైద్యులకు ఆమె అనేక ప్రశ్నలు వేశారు. లింగ వివక్షను ఎదుర్కొన్నారా అని ప్రశ్నించినపుడు 70 శాతం మంది మహిళల్లో 22 శాతం మంది లింగ వివక్షను ఎదుర్కొన్నామని, 30 శాతం మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. హుందాగల ఉద్యోగంలో ఉన్న మహిళలకూ వేధింపులు తప్పడం లేదని జాగ్సి తెలిపారు. వైద్య విద్యార్థుల సిలబస్ లో లింగ సమానత్వం గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు సామాజిక సమస్యగా మారాయని జాగ్సి అన్నారు. పరిశోధన వివరాలను అమెరికాలోని జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించింది.
Advertisement