విమానంలో అసభ్య ప్రవర్తన: విశాఖవాసి అరెస్టు
లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కె.వీరభద్రరావు (58)ని అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నెవార్క్ ఫెడరల్ కోర్టులో మేజిస్ట్రేట్ జడ్జి జోసెఫ్ డిక్సన్ ఎదుట ప్రవేశపెట్టగా, దాదాపు రూ. 33 లక్షల సెక్యూరిటీ బాండ్ సమర్పించిన తర్వాత విడుదల చేశారు. ఆయన నేరం చేసినట్లు రుజువైతే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 1.67 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
ఆయన ప్రయాణిస్తున్న విమానం నెవార్క్‌కు జూలై 30న చేరగానే ఆయనను అరెస్టు చేశారు. లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో వీరభద్రరావు మధ్యసీటులో కూర్చున్నారని, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే తాను నిద్రపోయానని బాధితురాలు చెప్పారు. అయితే కాసేపటికి ఆయన తనను అసభ్యంగా తాకడంతో మెలకువ వచ్చిందన్నారు. దాంతో తాను తనతోపాటు వచ్చిన వ్యక్తితో కలిసి అతడితో గొడవ పడ్డానని తెలిపారు. జరిగినదంతా మర్చిపోవాలని... కావాలంటే ఒక డ్రింక్ కొనిపెడతానని ఆయన ఆఫర్ చేశారని, కానీ తాము మాత్రం దాన్ని తిరస్కరించి విమాన సి బ్బందికి జరిగిన విషయం చెప్పామని అన్నారు. దాంతో సిబ్బంది వీరభద్రరావును వేరే సీటులోకి మార్చారని, మళ్లీ ఈ సీటులోకి రావద్దని హెచ్చరించారని చెప్పారు. చివరకు విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయనను అరెస్టుచేసి, అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.