మహిళా డాక్టర్లకూ తప్పని లైంగిక వేధింపులు
వాషింగ్టన్: సమాజంలో మిగతా ప్రొఫెషన్లతో పోల్చితే.. డాక్టర్ ప్రొఫెషన్కు ఉన్న గౌరవమే వేరు. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో మాత్రం వైద్యరంగం మిగతా రంగాలకు మినహాయింపేమీ కాదని చెబుతున్నాయి తాజా సర్వేలు. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జేఏఎమ్ఏ) ప్రచురించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
అమెరికా వైద్యరంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డాక్టర్లపై జరిపిన పరిశీలనలో 30 శాతం మంది మహిళలు తాము ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. సుమారు వెయ్యి మందికి పైగా హై ప్రొఫైల్ మహిళా డాక్లర్లపై యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన సర్వే వివరాలను జేఏఎమ్ఏలో ప్రచురించారు. అయితే ఈ సర్వేలో పాల్గొన్న డాక్టర్లంతా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేత ప్రతిష్టాత్మక కెరీర్ డెవలప్మెంట్ అవార్డ్స్ అందుకున్న సీనియర్ డాక్టర్లు కావడం విశేషం. ఈ సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది మహిళా డాక్టర్లు తాము లింగ వివక్షతను ఎదుర్కొన్నామని చెప్పారు.
ఈ వివరాలు సమాజంలో ఇంకా సాధించాల్సిన జెండర్ ఈక్వాలిటీని గుర్తుచేస్తున్నాయని మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రేష్మా జగ్సీ తెలిపారు. గత నెలలో వెల్లడించిన సర్వే వివరాల్లో సైతం.. పురుష డాక్టర్ల కంటే మహిళా డాక్టర్ల వేతనం 24 శాతం తక్కువగా ఉంటోందని వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.