16 ఏళ్లు రిలేషన్‌లో ఉండి రేప్‌ అంటే ఎలా? | Woman can not claim molestation after being in live-in for 16 years | Sakshi
Sakshi News home page

16 ఏళ్లు రిలేషన్‌లో ఉండి రేప్‌ అంటే ఎలా?

Published Fri, Mar 7 2025 6:08 AM | Last Updated on Fri, Mar 7 2025 1:05 PM

Woman can not claim molestation after being in live-in for 16 years

అత్యాచారం కేసును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్‌ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్‌ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.

‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్‌గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్‌గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. 

సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. 

అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 

2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్‌ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement