అమ్మకు అర్హత లేదు!
⇒ జయలలిత సమాధిపై అభ్యంతర పిటిషన్
⇒ నేరస్తురాలికిమణిమండపమా?
⇒ మెరీనాబీచ్ నుంచిజయ మృతదేహాన్ని తొలగించాలి
⇒ తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
‘ద్రవిడ ఉద్యమ రథ సారథి అన్నాదురై, తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం ఎంజీ రామచంద్రన్, పండిత పామరులకు ఆదర్శనీయుడు కామరాజనాడర్ వంటి మహాపురుషుల సమాధి సరసన నేరస్తురాలైన జయలలితకు స్థానమా..? ఎంత మాత్రం సహించేది లేదు’ అంటున్నారు ఎస్ దురైస్వామి అనే న్యాయవాది. అంతేగాదు మద్రాసు హైకోర్టులో ఈ మేరకు ఇటీవల వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం విచారణకు వచ్చింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనలకు విరుద్ధంగా చేపట్టబోతున్న జయ స్మారక మండప పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్ ఎస్.దురైస్వామి కోరారు. ఆయన హైకోర్టులో వేసిన వాజ్యంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరీమానా విధించింది. కోర్టు తీర్పు వెలువడగానే జయలలిత కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నిర్దోషిగా బయటపడ్డారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే దాఖలుచేసిన అప్పీలు పిటిషన్పై విచారించి కింది కోర్టు వేసిన శిక్షను సుప్రీం కోర్టు ఖరారుచేసింది. అయితే గత ఏడాది డిసెంబరు 5వ తేదీన జయలలిత మరణించడం వల్ల ఇదే కేసులో మిగిలిన ముగ్గురు నిందితులైన శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జయలలిత భౌతిక కాయాన్ని గత ఏడాది డిసెంబరు 6వ తేదీన మెరీనాబీచ్లోని ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. సహజంగా మెరీనా తీరంలో వీవీఐపీలకు మాత్రమే స్మారక మండపం కట్టాలనే సంప్రదాయం తమిళనాడు ప్రభుత్వంలో ఉంది.
ఆస్తుల కేసులో శిక్షపడిన జయలలితకు స్మారక మండపం కట్టడం వల్ల ఆమె చేసిన నేరానికి గుర్తుగా మిగిలే అవకాశం ఉంది. ఎంజీఆర్ సమాధి పక్కనే జయను ఖననం చేయడం చట్టవిరుద్ధం. అంతేగాక పర్యావరణం, సముద్రతీర ప్రాంతాల నిబంధనలకు విరుద్ధం. బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయి.
మహాత్మాగాంధీ, జవహర్లాల్ తదితరులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినట్లే, తమిళనాడులో పెరియార్, కామరాజనాడార్, అన్నాదురై తదితరులు ప్రజాశ్రేయస్సుకు పాటుపడ్డారు. అయితే జయలలిత ఈ కోవకు చెందిన వారు కారు. అవినీతికి పాల్పడి జైలు జీవితం అనుభవించారేగానీ, ప్రజా పోరాటాలతో కాదు. ఇదిలా ఉండగా జయ సమాధి వద్ద మణిమండపం నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా సీఎం ఎడపాడి గత నెల 28వ తేదీన ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా చేపట్టబోతున్న జయ స్మారక మండపం పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించేలా ఆదేశించాలి’’ అని పిటిషనర్ కోరారు. న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆగస్టు 18వ తేదీన కోర్టుకు వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం, చెన్నై కార్పొరేషన్, సీఎండీఏ, పర్యావరణశాఖకు నోటీసులు పంపాల్సిందిగా న్యాయమూర్తులు కోర్టును ఆదేశించారు.