ఇద్దరు విడిపోవడాన్ని నేరంగా పరిగణించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది.
ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు.
కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment